Ryanair: అద్భుతమైన ఫోటో తీశా.. ఫ్రీ టికెట్ ఇవ్వాలన్న ప్రయాణికుడు.. ర్యాన్ ఎయిర్ రిప్లై వైరల్!

Ryanairs blunt reply to passengers free ticket request goes viral
  • విమానం నుంచి రోమ్ నగరాన్ని ఫోటో తీసిన ప్రయాణికుడు
  • అద్భుతమైన ఫోటోకు ఫ్రీ టికెట్ ఇవ్వాలని ర్యాన్ ఎయిర్‌ను కోరిన వ్యక్తి
  • 'నో' అంటూ ఒకే ఒక్క పదంతో సమాధానమిచ్చిన విమానయాన సంస్థ
సోషల్ మీడియాలో సరదాగా చేసే పోస్టులు కొన్నిసార్లు ఊహించని రీతిలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ర్యాన్ ఎయిర్ విషయంలో ఇదే జరిగింది. ఓ ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు ఆ సంస్థ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

ఓ ప్రయాణికుడు ర్యాన్ ఎయిర్ విమానంలో ప్రయాణిస్తూ ఆకాశం నుంచి రోమ్ నగరం అందంగా కనబడుతున్న ఫోటో తీశాడు. ఆ ఫోటోను 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ "హే ర్యాన్ ఎయిర్ మీ విమానం నుంచి రోమ్ నగరాన్ని ఫోటో తీశాను. ఈ అద్భుతమైన ఫోటోకు బదులుగా నాకు ఒక ఫ్రీ టికెట్ ఇస్తారా?" అని ట్యాగ్ చేశాడు.

సాధారణంగా ఇలాంటి పోస్టులకు సంస్థలు స్పందించవు లేదా మర్యాదపూర్వకంగా బదులిస్తాయి. కానీ, ర్యాన్ ఎయిర్ ఇందుకు భిన్నంగా స్పందించింది. పొడవైన వివరణలు ఇవ్వకుండా సింపుల్‌గా 'నో' అని ఒకే ఒక్క పదంతో సమాధానమిచ్చింది.

ఈ సూటి రిప్లై క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు. "వాళ్లు చెప్పిన 'నో' భలే నచ్చింది" అని ఒకరు కామెంట్ చేయగా, "వాళ్లు లగేజీలో ఒక్క కిలో కూడా ఉచితంగా ఇవ్వరు, అలాంటిది ఫ్రీ టికెట్ ఇస్తారా?" అని మరొకరు చమత్కరించారు. "ప్రతిరోజూ వేలాది మంది ఇలా విమానం నుంచి ఫోటోలు తీస్తారు. కానీ ఫ్రీ ఫ్లైట్ టికెట్ అడిగేంత ధైర్యం ఎంతమందికి ఉంటుంది?" అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
Ryanair
Ryanair free ticket
Rome photo
viral tweet
airline reply
social media
budget airline
flight photography
funny reply
travel

More Telugu News