Nitin Gadkari: రాష్ట్రాలకు ఆధునిక అంబులెన్సులు.. కేంద్ర మంత్రి గడ్కరీ కీలక ప్రకటన

Nitin Gadkari announces modern ambulances for states
  • ప్రమాద స్థలానికి 10 నిమిషాల్లో చేరాలన్నదే ప్రధాన షరతు
  • దేశంలో ఏటా 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్న కేంద్ర మంత్రి గడ్కరీ
  • బాధితులను కాపాడిన వారికి 'రహదారి వీరులు'గా గుర్తింపుతో నగదు బహుమతి ఇస్తామని వెల్లడి
దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా పెరుగుతున్న మరణాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆధునిక సౌకర్యాలు కలిగిన అంబులెన్స్‌లను రాష్ట్రాలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాలనే షరతుపైనే వాటిని అందజేస్తామని రాజ్యసభలో ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా దేశంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. మృతుల్లో 66 శాతం మంది 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు వారే ఉండటం అత్యంత బాధాకరమని ఆయన తెలిపారు.

అలాగే, ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించేలా 'రహదారి వీరులు' (Road Heroes) పేరుతో ఒక పథకాన్ని ప్రకటించారు. బాధితులను రక్షించిన వారికి రూ.25,000 నగదు బహుమతి అందిస్తామని గడ్కరీ తెలిపారు. అంబులెన్సుల నిర్వహణ బాధ్యత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పరిధిలోకి రాదని, రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి ప్రతి రాష్ట్రానికి 100 నుంచి 150 అంబులెన్సులను అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. 
Nitin Gadkari
Road accidents India
Ambulance services
Road safety
Ministry of Road Transport and Highways
Road Heroes scheme
NHAI
National Highways Authority of India
Emergency medical services
Indian roads

More Telugu News