Ahmad Al Ahmad: కాఫీ కోసం వెళ్లి హీరోగా మారాడు.. సిడ్నీ దాడిని అడ్డుకున్న సిరియా యోధుడు!

Sydney Attack Hero Ahmad Al Ahmad Coffee Shop Encounter
  • సిడ్నీ బాండీ బీచ్ హీరోగా నిలిచిన అహ్మద్ అల్ అహ్మద్
  • ఉగ్రవాదిని ఎదుర్కొని తుపాకీ లాక్కొని ప్రాణాలు కాపాడిన వైనం
  • అహ్మద్‌కు సిరియా సైన్యంలో పనిచేసిన అనుభవం
  • అహ్మద్ ధైర్యాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రధాని
ఒక కప్పు కాఫీ తాగడానికి వెళ్లిన వ్యక్తి ఊహించని రీతిలో ప్రపంచ హీరోగా మారిపోయాడు. సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి బీభత్సం సృష్టిస్తుండగా, అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి వారిని ఎదుర్కొన్నాడు. తన నిస్వార్థ సాహసంతో ఎందరో ప్రాణాలను కాపాడాడు.

ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అహ్మద్ ఒక వాహనం చాటున దాక్కున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెమ్మదిగా ఉగ్రవాదుల్లో ఒకరిని సమీపించి, అతడిపైకి దూకి చేతిలోని తుపాకీని లాక్కున్నాడు. ఆ తర్వాత ప్రశాంతంగా ఆ తుపాకీని ఒక చెట్టు పక్కన పెట్టాడు. ఈ ఘటనలో అహ్మద్‌కు రెండు బుల్లెట్ గాయాలయ్యాయి.

ఈ సాహసానికి కారణం అహ్మద్‌కు ఉన్న సైనిక నేపథ్యమే. యుద్ధంతో అతలాకుతలమైన సిరియా సైన్యంలో ఆయన గతంలో పనిచేశారు. ఆయుధాలు ధరించిన వారిని ఎలా ఎదుర్కోవాలో తెలిసినందునే ఉగ్రవాదిని నిరాయుధుడిని చేయగలిగాడని ఆయన బంధువులు ఆస్ట్రేలియా మీడియాకు తెలిపారు. 2007లో సిరియాలోని అల్ నయ్రబ్ పట్టణం నుంచి అహ్మద్ ఆస్ట్రేలియాకు వలస వచ్చారు.

ఈ దాడికి పాల్పడింది తండ్రీకొడుకులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అని పోలీసులు గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ మరణించగా, 15 మంది అమాయకులను వీరు పొట్టనబెట్టుకున్నారు. సాజిద్‌కు హైదరాబాద్‌తో సంబంధాలున్నాయి. 1997లో ఆయన భారత్ నుంచి వలస వెళ్లినట్లు తేలింది. గాయపడిన ఉగ్రవాది నవీద్ కోమా నుంచి బయటకు రాగా, అతనిపై హత్య, టెర్రరిజం సహా 59 అభియోగాలు నమోదు చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పరామర్శించారు. కేవలం కాఫీ కోసం వచ్చిన వ్యక్తి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి ముందుకొచ్చాడని, ఆయన ధైర్యం ఆస్ట్రేలియన్లందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అహ్మద్ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేదని అధికారులు తెలిపారు.
Ahmad Al Ahmad
Sydney Bondi Beach
Syria
Australia
Sajid Akram
Naveed Akram
Terrorist Attack
Bondi Beach Shooting
Sydney Hero
Indian Connection

More Telugu News