Chandrababu Naidu: కేంద్ర నిధులపై చంద్రబాబు సీరియస్.. జనవరి 15 డెడ్‌లైన్!

Chandrababu Naidu Serious on Central Funds Utilization Deadline January 15
  • కేంద్ర నిధుల వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • నిధులు మిగిలిపోతుండడంపై ఆగ్రహం
  • మిగిలిన నిధులను జనవరి 15లోగా ఖర్చు చేయాలని ఆదేశం
  • పీఎంఏవై-అర్బన్ పథకంలో తక్కువ ఖర్చుపై తీవ్ర అసంతృప్తి
  • ఈ ఏడాది రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం
  • నిర్వీర్యంగా ఉన్న ప్రభుత్వ ఖాతాల్లోని నిధులపై సీఎం ఆరా
కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో, వివిధ శాఖల వద్ద ఇంకా రూ.6,252 కోట్లు ఖర్చు చేయకుండా మిగిలిపోవడంపై అధికారులను ఆయన నిలదీశారు. ఈ నిధులన్నింటినీ రాబోయే జనవరి 15వ తేదీలోగా నూటికి నూరు శాతం ఖర్చు చేయాలని గట్టిగా ఆదేశించారు.

"ఒకవైపు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర పథకాల్లో అందుబాటులో ఉన్న నిధులను కూడా ఖర్చు చేయకపోవడమేంటి?" అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మొత్తం రూ.24,513 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఇంత పెద్ద మొత్తంలో నిధులు మిగిలిపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) - అర్బన్ పథకం కింద కేవలం 38 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. 

ఈ నిధుల వినియోగాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రి కొలుసు పార్థసారధిని ఆదేశించారు. గతంలో విజిలెన్స్ విచారణ కారణంగా ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలకు వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలని, తద్వారా నిధుల ఖర్చును వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా పథకం కింద రూ.1363 కోట్లకు గాను ఇప్పటికే రూ.1259 కోట్లు ఖర్చు చేశామని, మిగిలిన నిధులను కూడా త్వరగా పూర్తి చేస్తామని సీఎంకు వివరించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి రాష్ట్రానికి అదనంగా రూ.1200 కోట్లు కోరినట్లు తెలిపారు.

కేంద్రం నుంచి అదనంగా నిధులు రాబట్టుకోవడంపై చంద్రబాబు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. "జనవరి నాటికి పీఎంఏవై అర్బన్‌లో 75 శాతం నిధులు ఖర్చు చేస్తే అదనంగా నిధులు సాధించవచ్చు. ఈ ఏడాది కేంద్ర పథకాల ద్వారా రూ.30 వేల కోట్ల ఖర్చును లక్ష్యంగా పెట్టుకుందాం. ప్రస్తుతం ఉన్నవి ఖర్చు చేస్తే మరో రూ.5 నుంచి 6 వేల కోట్లు అదనంగా తెచ్చుకోవచ్చు" అని తెలిపారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ మొదలవుతున్నందున, సంబంధిత కేంద్ర మంత్రులతో టచ్‌లో ఉండాలని, ఏపీకి అదనపు ప్రయోజనాలు చేకూరేలా చూడాలని సూచించారు.

ఇదే సమావేశంలో, రాష్ట్రవ్యాప్తంగా 63 వేల ప్రభుత్వ ఖాతాలు నిర్వీర్యంగా (ఇన్ యాక్టివ్) ఉన్నాయని, వాటిలో సుమారు రూ.155 కోట్ల నిధులు ఉండిపోయాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఆ నిధులను వెంటనే విత్‌డ్రా చేయించి, కనీసం వడ్డీ అయినా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని శాఖల ఆడిట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Central Funds
PMAV Urban
Nara Lokesh
Kolusu Parthasarathy
Government Schemes
Fund Utilization
Dharmendra Pradhan
Central Budget

More Telugu News