John Abraham: 53 ఏళ్ల జాన్ అబ్రహం... కుర్రాళ్లను మించిన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

John Abraham Fitness Mantra at 53
  • ఫిట్‌నెస్‌లో 60 శాతం ఆహారానిదే ప్రాధాన్యం
  • వర్కౌట్‌లో సమయం కన్నా సరైన టెక్నిక్ ముఖ్యం
  • కండరాల పెరుగుదలకు 8 గంటల నిద్ర తప్పనిసరి
  • స్టెరాయిడ్స్, షార్ట్‌కట్స్‌కు పూర్తిగా దూరం
  • క్రమశిక్షణే అసలైన ఫిట్‌నెస్ రహస్యమంటున్న జాన్
బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నేడు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. యాక్షన్ చిత్రాలకు చిరునామాగా నిలిచే ఆయన, కండలు తిరిగిన శరీరంతో యువతకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూ ఉంటారు. అయితే, ఈ ఫిజిక్ ఒక్కరోజులో వచ్చింది కాదని, దాని వెనుక ఏళ్ల తరబడి పక్కా ప్రణాళిక, కఠినమైన క్రమశిక్షణ ఉన్నాయని ఆయన స్పష్టం చేస్తుంటారు. ఈ సందర్భంగా, గతంలో ఆయన పంచుకున్న ఫిట్‌నెస్ రహస్యాలపై ఓ లుక్కేద్దాం.

ఆహారమే అసలైన బలం
జాన్ ఫిట్‌నెస్‌లో 60 శాతం ప్రాధాన్యం ఆహారానిదే. మిగిలిన 40 శాతం మాత్రమే వర్కౌట్‌కు ఇస్తానని చెబుతారు. ఎంత బిజీగా ఉన్నా అల్పాహారం మానకూడదని, గుడ్లు, పండ్లు వంటి పోషకాహారంతో రోజును ప్రారంభించాలని సూచిస్తున్నారు. రోజంతా చిన్న చిన్న మీల్స్ తీసుకోవడం వల్ల మెటబాలిజం చురుగ్గా ఉంటుందని అంటారు. ఖరీదైన డైట్ ప్లాన్‌ల కన్నా, మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు చూసుకోవడం ముఖ్యమని ఆయన నమ్మకం. అన్నం, బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, వాటిని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవాలని చెబుతారు. సెట్‌లో గులాబ్ జామూన్, సమోసాలను కూడా పక్కనపెట్టిన సందర్భాలున్నాయని, స్వీట్స్‌పై నియంత్రణ చాలా అవసరమని జాన్ అంటారు.

వర్కౌట్, నిద్రకు ప్రాధాన్యం
జాన్ వర్కౌట్ రొటీన్ సినిమా పాత్రలను బట్టి మారుతూ ఉంటుంది. కండలు పెంచడానికి బరువులు ఎత్తడం, లీన్‌గా కనిపించడానికి కార్డియో చేయడం వంటివి చేస్తుంటారు. అయితే వర్కౌట్‌లో సమయం కన్నా సరైన టెక్నిక్‌కే ప్రాధాన్యమివ్వాలని, లేదంటే కీళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వారంలో లెగ్ డే అస్సలు మిస్ చేయకూడదని, అప్పుడే శరీరానికి సంపూర్ణ బలం వస్తుందని చెబుతారు.

ఫిట్‌నెస్ ప్రయాణంలో నిద్ర పాత్ర చాలా కీలకమని జాన్ బలంగా నమ్ముతారు. కండరాలు జిమ్‌లో కాదని, మనం నిద్రపోయినప్పుడే పెరుగుతాయని అంటారు. అందుకే రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, వృద్ధాప్య ఛాయలను త్వరగా తెస్తుందని హెచ్చరిస్తున్నారు. స్టెరాయిడ్స్, డ్రగ్స్, పాన్ మసాలా వంటి వాటికి దూరంగా ఉండాలని, ఫిట్‌నెస్ కోసం ఎలాంటి షార్ట్‌కట్స్ వెతకవద్దని ఆయన యువతకు సలహా ఇస్తున్నారు. 53 ఏళ్ల వయసులో కూడా ఆయన ఫిట్‌నెస్ చూస్తే, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, సరైన జీవనశైలే ఆరోగ్యానికి అసలైన రహస్యమని స్పష్టమవుతుంది.
John Abraham
John Abraham fitness
John Abraham birthday
Bollywood actor
fitness secrets
diet plan
workout routine
healthy lifestyle
Indian cinema

More Telugu News