TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల కోటా టికెట్ల విడుదల రేపే... షెడ్యూల్ ఇదిగో!

TTD to Release Tirumala Arjitha Seva Tickets for March 2026
  • మార్చి నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు 18న విడుదల
  • ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ వరకు నమోదుకు అవకాశం
  • 22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ టికెట్ల జారీ
  • ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 24న అందుబాటులోకి
  • అదే రోజున తిరుమల, తిరుపతి గదుల కోటా విడుదల 
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026 మార్చి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. భక్తులు ఈ సేవల కోసం రేపటి నుంచి డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇతర సేవల టికెట్లను కూడా పలు తేదీల్లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను అందుబాటులో ఉంచుతారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను విడుదల చేస్తారు.

డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ తేదీలను గమనించి, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
TTD
Tirumala
Tirupati
Arjitha Seva Tickets
Srivari Seva
Online Booking
TTD Online
Special Entry Darshan
Accommodation
Srivani Trust

More Telugu News