Sreeleela: సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్... చేతులు జోడించి విజ్ఞప్తి చేసిన శ్రీలీల

Sreeleela requests to stop AI generated fake content on social media
  • ఏఐ ఆధారిత చెత్తను ప్రోత్సహించవద్దని కోరిన నటి శ్రీలీల
  • టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆవేదన
  • ఈ పరిణామం తనను మానసికంగా కుంగదీసిందని వెల్లడి
  • ఈ వ్యవహారాన్ని ఇక అధికారులు చూసుకుంటారని స్పష్టీకరణ
  • గతంలో ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఇదే సమస్యపై స్పందన
ప్రముఖ సినీ నటి శ్రీలీల సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టిస్తున్న అసభ్యకరమైన, నిరాధారమైన కంటెంట్‌ను దయచేసి ఎవరూ ప్రోత్సహించవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

"టెక్నాలజీని వినియోగించుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉంది. సాంకేతికత జీవితాన్ని సులభతరం చేయడానికే కానీ, సంక్లిష్టం చేయడానికి కాదని నేను భావిస్తాను" అని శ్రీలీల తన పోస్టులో పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న ప్రతీ అమ్మాయి కూడా ఎవరో ఒకరికి కూతురు, సోదరి, స్నేహితురాలు అని గుర్తుంచుకోవాలని అన్నారు. తాము సురక్షితమైన వాతావరణంలో ఉన్నామనే భరోసాతోనే చిత్ర పరిశ్రమలో పనిచేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.

తన పని ఒత్తిడి, షెడ్యూళ్ల కారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న చాలా విషయాలు తన దృష్టికి రాలేదని, శ్రేయోభిలాషులు చెప్పడంతోనే ఈ విషయం తెలిసిందని శ్రీలీల వివరించారు. ఫేక్ కంటెంట్ పరిణామం తనను తీవ్రంగా కలచివేసిందని, మానసికంగా కుంగదీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే తోటి నటీనటులు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందరి తరఫున తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఇకపై సంబంధిత అధికారులు చూసుకుంటారని ఆమె స్పష్టం చేశారు.

గత అక్టోబర్‌లో మరో ప్రముఖ నటి ప్రియాంక అరుళ్ మోహన్ కూడా తనపై వచ్చిన ఏఐ ఫేక్ ఫోటోల గురించి ఇదే విధంగా స్పందించారు. ఏఐని తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి కాకుండా, సృజనాత్మకతకు వాడాలని ఆమె కోరిన విషయం తెలిసిందే.
Sreeleela
AI content
artificial intelligence
fake content
social media
Priyanka Arul Mohan
actress
cyber security
misinformation
Telugu cinema

More Telugu News