Chandrababu Naidu: పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు... మెడికల్ కాలేజీలపై క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Clarifies PPP Medical Colleges Not Privatized
  • పీపీపీ విధానంలో నిర్మించినా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని వెల్లడి
  • విమర్శలకు భయపడబోమని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
  • రుషికొండ ప్యాలెస్‌పై రూ.500 కోట్లు వృధా చేశారని ఆరోపణ
  • గత ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రాష్ట్రం అప్పులపాలైందని వెల్లడి
  • సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్న చంద్రబాబు
రాష్ట్రంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలలో ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ప్రారంభమైన ఐదవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పీపీపీ విధానంపై పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా వైద్య సేవలను మరింత మెరుగుపరిచి, ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

"పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా, అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే కొనసాగుతాయి. వాటి నిర్వహణ, నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ఈ కళాశాలల్లో 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవల కింద చికిత్స అందుతుంది. సీట్లు కూడా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం సైతం అనేక ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలోనే చేపడుతోంది. రోడ్లను పీపీపీ ద్వారా నిర్మిస్తే అవి ప్రైవేటు వ్యక్తులవి అయిపోతాయా? కేవలం విమర్శల కోసం మాట్లాడితే భయపడేది లేదు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది" అని ముఖ్యమంత్రి అన్నారు.

గత ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు విమర్శించారు. "రూ.500 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేశారు. ఆ డబ్బుతో రెండు అత్యాధునిక మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయ్యేది. ఇప్పుడు ఆ ప్యాలెస్ నిర్వహణ ప్రభుత్వానికి పెను భారంగా మారింది. గత ప్రభుత్వంలో జీతాలు కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితులు ఉండేవి. 13 నుంచి 14 శాతం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. అనవసరపు ఖర్చులతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు" అని ఆయన ఆరోపించారు. 

ప్రస్తుతం తమ ప్రభుత్వం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఆ అప్పులను రీ-షెడ్యూల్ చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన 70 శాతం ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేసి, కొత్త రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు.

‘సూపర్ సిక్స్’ సూపర్ సక్సెస్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. "పేదలకు ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతోనే సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను ప్రతినెలా ఒకటో తేదీనే అందిస్తున్నాం. ‘తల్లికి వందనం’ ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నాం. ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు రెండు విడతల్లో రూ.14 వేలు అందించాం. దీపం-2.0, స్త్రీశక్తి పథకాలతో పాటు మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేశాం. 

డ్వాక్రా, మెప్మా సంఘాలను అనుసంధానం చేసి మహిళలను బలోపేతం చేస్తున్నాం. పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టి అందరికీ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నాం" అని ఆయన వివరించారు. 

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా (P4 - Public, Private, People Partnership for Poverty Eradication) పనిచేయాలని, ప్రజలకు ప్రివెంటివ్, క్యురేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ విధానంలో వైద్యారోగ్యం అందించాలని కలెక్టర్లకు సూచించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
PPP
Medical Colleges
Public Private Partnership
Healthcare
NTR Vaidya Seva
Government Schemes
Super Six Schemes
AP Politics

More Telugu News