Shree Charani: క్రికెటర్ శ్రీ చరణికి రూ. 2.5 కోట్ల చెక్కును అందజేసిన మంత్రి నారా లోకేశ్

Andhra Pradesh presents Rs 25 crore cash reward to woman cricketer Shree Charani
  • ప్రపంచకప్ విజేత శ్రీ చరణికి రూ. 2.5 కోట్ల నగదు బహుమతి
  • చెక్కును స్వయంగా అందజేసిన మంత్రి నారా లోకేశ్
  • విశాఖలో ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం కూడా కేటాయింపు
  • ప్రపంచకప్‌లో 14 వికెట్ల‌తో స‌త్తా చాటిన‌ కడపకు చెందిన శ్రీ చరణి
మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఇవాళ‌ ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆమెకు ఈ చెక్కును అందజేశారు.

ఈ నగదు బహుమతితో పాటు విశాఖపట్నంలో 500 గజాల నివాస స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కడప జిల్లాకు చెందిన శ్రీ చరణి, ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఆమె, ఈ టోర్నీలో మొత్తం 14 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. నవంబర్ 2న జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల జట్టు తమ తొలి ఐసీసీ ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.

గత నెలలోనే సీఎం చంద్రబాబు శ్రీ చరణిని అభినందించి, ఈ ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
Shree Charani
AP Govt
Nara Lokesh
Women's World Cup
Indian Women's Cricket Team
Andhra Pradesh
Sports Incentive
Group 1 Job
Visakhapatnam
Chandrababu Naidu

More Telugu News