Chandrababu: పాలనలో ఇక ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’.. ప్రభుత్వానికి కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లు: సీఎం చంద్రబాబు

Chandrababu Introduces Speed of Delivering Governance in AP
  • పాలనలో ఇక ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
  • ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని సూచన
  • ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడంపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు
  • 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యమని స్పష్టీకరణ
రాష్ట్ర పాలనలో వేగాన్ని పెంచి, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తరహాలోనే ఈ విధానం ఉంటుందని, ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

అమరావతిలోని సచివాలయంలో ఇవాళ‌ జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారుల పనితీరుకు ఇకపై ఇదే కొలమానం అవుతుందని తెలిపారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను (గ్రీవెన్సులు) త్వరితగతిన పరిష్కరించి, ఆ వివరాలను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించారు.

ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయిని పెంచాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం అన్నారు. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, యువత వంటి అన్ని వర్గాలకు మేలు చేయడం ద్వారా ప్రభుత్వానికి సానుకూలత వస్తుందన్నారు. పాలనలో ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, వారి సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.

ఒక జిల్లాలో అమలవుతున్న ఉత్తమ విధానాలను (బెస్ట్ ప్రాక్టీసెస్) ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలను పటిష్టంగా అమలు చేసి 15 శాతం వృద్ధి రేటు సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Chandrababu
Andhra Pradesh
Speed of Delivering Governance
District Collectors
Government Schemes
Public Grievances
Ease of Doing Business
Best Practices
Social Media
Economic Growth

More Telugu News