Chandrababu Naidu: పవన్ కల్యాణ్ పనితీరు అద్భుతం.. అధికారుల తీరు మారాలి: చంద్రబాబు

Chandrababu Praises Pawan Kalyans Work Ethic at Collectors Conference
  • కలెక్టర్ల సదస్సులో పవన్ కల్యాణ్‌పై చంద్రబాబు ప్రశంసలు
  • విభిన్న రంగం నుంచి వచ్చినా పాలనలో అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడిన సీఎం
  • కానిస్టేబుల్ కోరిక మేరకు పవన్ అక్కడికక్కడే రోడ్డు మంజూరు చేయించారని వెల్లడి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. విభిన్న రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, పరిపాలనలో పవన్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని కొనియాడారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. పవన్ పనితీరుకు ఓ ఉదాహరణను వివరించారు.

తాజాగా 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో, ఓ కానిస్టేబుల్ తన గ్రామానికి సరైన రోడ్డు లేదని ప్రస్తావించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ విషయంపై పవన్ తక్షణమే స్పందించారని తెలిపారు. తన శాఖ అధికారులతో మాట్లాడి, అదే వేదికపై నుంచి ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని వెల్లడించారు. ఈ వేగవంతమైన పనితీరు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

అనంతరం అధికారుల పనితీరుపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సులు మొక్కుబడిగా కాకుండా, అర్థవంతమైన చర్చలతో జరగాలని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్య విద్యార్థుల్లా ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. "వ్యవస్థలోని లోపాలను అలుసుగా తీసుకుని కొందరు పనుల నుంచి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఫైళ్లను పరిష్కరించకుండా ఒకరి నుంచి మరొకరికి పంపిస్తున్నారు. ఈ విధానం మారాలి. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలి" అని చంద్రబాబు అన్నారు.

డేటా ఆధారిత పాలన ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. లోకేశ్ విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకువచ్చారని, ప్రతి శాఖ ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్వీర్యమైన కేంద్ర ప్రాయోజిత పథకాలను తిరిగి పట్టాలెక్కిస్తున్నామని తెలిపారు. పాలనలో లోటుపాట్లను సరిచేసుకున్నప్పుడే ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Chandrababu Naidu
Pawan Kalyan
Andhra Pradesh
Collector Conference
Road Construction
Constable Recruitment
Data Driven Governance
Revenue Department
Google Data Center
Central Government Schemes

More Telugu News