Bhumana Karunakar Reddy: ఒబెరాయ్ హోటల్‌కు రూ.3 వేల కోట్ల టీటీడీ భూమి.. భూమన సంచలన ఆరోపణలు

Bhumana Karunakar Reddy Alleges 3000 Crore TTD Land Scam Against Chandrababu
  • చంద్రబాబు ప్రభుత్వం స్వామివారికి తీరని ద్రోహం చేసిందన్న భూమన
  • లీజు మాఫీ చేసి ప్రైవేటు సంస్థకు దోచిపెట్టారని ఆరోపణ
  • ఎర్రచందనం చెట్లను మాయం చేశారని విమర్శ
కూటమి ప్రభుత్వంపైనా, టీటీడీ ఛైర్మన్ పైనా వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతిలో అత్యంత విలువైన రూ.3 వేల కోట్ల టీటీడీ భూమిని ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి కట్టబెట్టి, శ్రీ వేంకటేశ్వర స్వామికి తీరని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. ఇది పరకామణి దొంగతనం కన్నా వంద రెట్లు పెద్దదని ఆరోపించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వంద గదుల హోటల్ కోసం అలిపిరి రోడ్డులోని అత్యంత విలువైన భూమిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పర్యాటక శాఖ భూమికి బదులుగా టీటీడీ భూమిని బదిలీ చేయడమే కాకుండా, లీజును కూడా మాఫీ చేసి చంద్రబాబు ప్రైవేటు సంస్థకు దోచిపెట్టారని ఆరోపించారు. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ, అది ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్)లో కనిపించకుండా ఎందుకు దాస్తున్నారని భూమన నిలదీశారు. దీని వెనుక వేల కోట్ల అవినీతి దాగి ఉందని, చంద్రబాబు, పవన్ కలిసి ఈ భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగించారని విమర్శించారు.

టీటీడీ భూములను ప్రైవేటుపరం చేయడాన్ని స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన కోరారు. తిరుమల భక్తులను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని భూమన కరుణాకర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి మాయం చేశారని ఆరోపించారు. ఈ అక్రమంపై అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని భూమన ప్రశ్నించారు. 
Bhumana Karunakar Reddy
TTD
Chandrababu Naidu
Oberoi Hotel
Tirupati
TTD lands
Pawan Kalyan
Andhra Pradesh Politics
YSRCP
Tourism Department

More Telugu News