Prithvi Shaw: ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాకు అనూహ్య అనుభవం... నిమిషాల్లో మారిన కథ!

Prithvi Shaw Dramatic IPL Auction Experience Delhi Capitals
  • ఐపీఎల్ వేలంలో రెండుసార్లు అమ్ముడుపోని పృథ్వీ షా
  • మనస్తాపంతో ఇన్స్టాగ్రామ్‌లో హార్ట్‌బ్రేక్ ఎమోజీ పోస్ట్
  • అనూహ్యంగా చివరి నిమిషంలో కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • పాత పోస్ట్ డిలీట్ చేసి... 'ఇంటికి తిరిగొచ్చా' అంటూ కొత్త స్టోరీ
భారత యువ క్రికెటర్ పృథ్వీ షాకు ఐపీఎల్ 2026 వేలంలో నాటకీయ అనుభవం ఎదురైంది. రెండుసార్లు ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన అతడిని చివరి నిమిషంలో తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అతడు చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి.

మంగళవారం జరిగిన వేలంలో రూ. 75 లక్షల కనీస ధరతో పృథ్వీ షా పేరు రాగా, ఎవరూ ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత యాక్సిలరేటెడ్ రౌండ్‌లోనూ అతనికి నిరాశే ఎదురైంది. దీంతో మనస్తాపం చెందిన షా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ఇట్స్ ఓకే' అని రాసి, పగిలిన గుండె (హార్ట్‌బ్రేక్) ఎమోజీని జతచేశాడు.

అయితే, వేలం ముగింపు దశలో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్యంగా అతని పేరును మూడోసారి ప్రతిపాదించి కొనుగోలు చేసింది. ఈ వార్త తెలిసిన వెంటనే షా తన పాత ఇన్‌స్టా స్టోరీని కేవలం ఆరు నిమిషాల్లోనే డిలీట్ చేశాడు. ఆ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తనను స్వాగతిస్తూ పెట్టిన పోస్ట్‌ను షేర్ చేస్తూ 'బ్యాక్ టు మై ఫ్యామిలీ'అని రాసి లవ్ ఎమోజీని జతచేశాడు.

26 ఏళ్ల పృథ్వీ షా 2018 నుంచి 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫునే ఆడాడు. భారత్ తరఫున 5 టెస్టులు, 6 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు షా కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Prithvi Shaw
IPL 2026 Auction
Delhi Capitals
Cricket
Indian Premier League
Auction News
Cricket News
Under 19 World Cup
Instagram Post
Viral News

More Telugu News