Hari Babu Bodepudi: సీక్వెంట్ సైంటిఫిక్ ఎండీ, సీఈవోగా డాక్టర్ బోడేపూడి హరిబాబు

Hari Babu Bodepudi Appointed MD and CEO of Sequent Scientific
  • సీక్వెంట్ సైంటిఫిక్ విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తి
  • వియాష్ వాటాదారులకు 18.19 కోట్ల ఈక్విటీ షేర్ల కేటాయింపు
  • చెల్లింపు మూలధనం రూ. 50.82 కోట్ల నుంచి రూ. 87.21 కోట్లకు పెంపు
ప్రముఖ ఫార్మా కంపెనీ సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్ తన విలీన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. డిసెంబర్ 16, 2025 నుంచి ఈ విలీనం అమల్లోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రక్రియలో భాగంగా వియాష్ లైఫ్ సైన్సెస్ వాటాదారులకు భారీగా షేర్లను కేటాయించడంతో పాటు, యాజమాన్యంలో కీలక నియామకాలను కూడా ఖరారు చేసింది.

విలీన పథకంలో భాగంగా, డిసెంబర్ 8, 2025ను రికార్డు తేదీగా పరిగణించి వియాష్ వాటాదారులకు 18.19 కోట్ల ఈక్విటీ షేర్లు, 2.03 కోట్ల వారెంట్లను కంపెనీ బోర్డు కేటాయించింది. ఈ కేటాయింపుల తర్వాత సంస్థ జారీ చేసిన, చెల్లించిన ఈక్విటీ మూలధనం రూ. 50.82 కోట్ల నుంచి రూ. 87.21 కోట్లకు పెరిగింది. అధీకృత మూలధనాన్ని రూ. 886.15 కోట్లకు పెంచినట్లు కంపెనీ తెలిపింది.

ఈ విలీనంలో భాగంగా యాజమాన్యంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవోగా డాక్టర్ హరిబాబు బోడెపూడిని రెండేళ్ల కాలానికి నియమించారు. ఆయనకు గతంలో మైలాన్ ల్యాబొరేటరీస్‌లో గ్లోబల్ సీవోవోగా పనిచేసిన విస్తృత అనుభవం ఉంది. అలాగే రాజారామ్ నారాయణన్ సీఈవో-యానిమల్ హెల్త్‌గా కొనసాగుతారు. శ్రీనివాస్ వాసిరెడ్డిని హోల్‌టైమ్ డైరెక్టర్‌గా నియమించారు. జనవరి 1, 2026 నుంచి కొత్త సీఎఫ్‌ఓగా రమాకాంత్ సింగాని బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ పునర్‌వ్యవస్థీకరణతో సీఏ హల్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థకు కొత్త ప్రమోటర్‌గా మారింది. డిసెంబర్ 16న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. 

ఫార్మా రంగంలో 30 ఏళ్ల ప్రస్థానం
ఫార్మాస్యూటికల్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ హరిబాబు, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందిన ఆయన రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ, కార్యకలాపాల నిర్వహణ వంటి విభిన్న విభాగాల్లో విశేషమైన సేవలందించారు.

గత 20 ఏళ్లుగా అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం 'మైలాన్ ల్యాబొరేటరీస్'లో అనేక కీలక నాయకత్వ పదవులను ఆయన అలంకరించారు. మైలాన్ ఇండియా సీవోవోగా, సీఈవోగా పనిచేయడమే కాకుండా, సంస్థ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) స్థాయికి ఎదిగారు. ఈ హోదాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50కి పైగా మైలాన్ ఫెసిలిటీల బాధ్యతలను ఆయన పర్యవేక్షించారు. సుమారు 200 ఏపీఐలు, 15,000 వేర్వేరు ఫార్ములేషన్లకు సంబంధించిన ఎస్‌కేయూల నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించారు.

మైలాన్ సంస్థ ఏఆర్‌వీ (యాంటీ-రెట్రోవైరల్) వ్యాపారంలోకి ప్రవేశించడంలో డాక్టర్ హరిబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో ఈ వ్యాపారం 800 మిలియన్ డాలర్ల ఫ్రాంచైజీగా వృద్ధి చెందింది. ప్రపంచ ఏఆర్‌వీ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకుని, వాల్యూమ్, పోర్ట్‌ఫోలియో పరంగా మైలాన్‌ను అగ్రస్థానంలో నిలబెట్టారు. గ్లోబల్ సప్లై చెయిన్, రెగ్యులేటరీ, ఏపీఐ ఆర్ అండ్ డీ, క్వాలిటీ వంటి అంశాలపై ఆయనకు విశేషమైన పట్టు ఉంది.
Hari Babu Bodepudi
Sequent Scientific
Viash Life Sciences
Merger
Pharmaceutical Company
Equity Shares
CA Hal Investments
Ramakanth Singani
Srinivas Vasireddy

More Telugu News