D Ramasami: డిజిటల్ అరెస్ట్ కు గురైన పద్మభూషణ్ అవార్డు గ్రహీత

D Ramasami Padma Bhushan Awardee Victim of Digital Arrest Scam
  • పద్మభూషణ్ గ్రహీత, శాస్త్రవేత్త డి. రామస్వామికి సైబర్ మోసం
  • 'డిజిటల్ అరెస్టు' పేరుతో రూ. 57 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
  • డబ్బును విదేశాలకు తరలించి క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు గుర్తింపు
  • కాంబోడియా నుంచి వాట్సప్ కాల్స్ వచ్చినట్లు తేల్చిన పోలీసులు
పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త డి. రామస్వామి (77) సైబర్ మోసగాళ్ల చేతిలో భారీగా మోసపోయారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఆయన నుంచి ఏకంగా రూ.57 లక్షలు కాజేశారు. ఈ డబ్బును సైబర్ నేరగాళ్లు విదేశాలకు తరలించి క్రిప్టో కరెన్సీలోకి మార్చినట్లు చెన్నై సైబర్ క్రైం పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
 
లెదర్ టెక్నాలజీలో నిపుణులైన రామస్వామి, గతంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. దేశానికి ఆయన అందించిన సేవలకు గానూ 2001లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తూ ఒక యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రామస్వామిని లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు, 'డిజిటల్ అరెస్టు' పేరుతో బెదిరించి ఆయన నుంచి విడతల వారీగా రూ.57 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులను ఆశ్రయించారు.
 
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామస్వామికి వచ్చిన వాట్సప్ కాల్స్ కాంబోడియా నుంచి వచ్చినట్లు టెక్నికల్ అనాలిసిస్‌లో తేలింది. మోసగాళ్లు ఆ డబ్బును వెంటనే ఏజెంట్ల ద్వారా చెక్కుల రూపంలో విత్‌డ్రా చేయించి, విదేశాలకు తరలించి క్రిప్టోగా మార్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు లేదా సంబంధిత వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
 
D Ramasami
Padma Bhushan
cyber crime
digital arrest
cyber fraud
Chennai cyber crime police
cryptocurrency
online scam
scientist
Tamil Nadu

More Telugu News