Damodar: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దామోదర్?

Maoist Leader Damodar Arrested in Police Custody
  • ఆసిఫాబాద్ అడవుల్లో 16 మంది మావోయిస్టుల అరెస్ట్
  • అరెస్టయిన వారిలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్!
  • కాల్పులు జరగకుండానే పక్కా వ్యూహంతో పట్టుకున్న పోలీసులు
  • అరెస్టుపై పోలీసుల గోప్యత.. హైదరాబాద్‌కు తరలింపు
  • ఛత్తీస్‌గఢ్‌లో 34 మంది మావోయిస్టులు లొంగుబాటు
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌తో పాటు మొత్తం 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) మండలంలోని పెద్దదోబ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ అరెస్టులు జరిగినట్లు తెలిసింది.

ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలోని ప్రత్యేక బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఎలాంటి ఎదురుకాల్పులకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో తొమ్మిది మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. వీరందరినీ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అరెస్టులపై స్థానిక పోలీసు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డీజీపీ కార్యాలయం నుంచే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

అరెస్టయిన వారిలో ఉన్న దామోదర్ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి వాసి. 1993లో పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన, పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి చేరారు. గతంలో బీఆర్ఎస్ నేత భీమేశ్వర్‌రావు, హోంగార్డు ఈశ్వర్‌ హత్య కేసుల్లో దామోదర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో దామోదర్ మరణించినట్లు వార్తలు వచ్చినా మావోయిస్టు పార్టీ వాటిని ఖండించింది. కాగా, తన కుమారుడిని కొట్టవద్దని, అతడిని తనకు చూపించాలని దామోదర్ తల్లి పోలీసులను వేడుకున్నారు. ఇదిలా ఉండగా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 34 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో తెలంగాణ కమిటీకి చెందిన వారు కూడా ఉన్నారని, వీరిపై రూ. 84 లక్షల రివార్డు ఉందని ఎస్పీ జితేందర్ యాదవ్ తెలిపారు. 
Damodar
Maoist leader
Telangana
Chhattisgarh
Kumram Bheem Asifabad
Sirpur U
police
arrest
Bade Chokkrao
Naxalites

More Telugu News