Chandrababu Naidu: ట్రైనీ కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు శుభవార్త... స్టైఫండ్ భారీగా పెంపు

Chandrababu Announces Good News for Trainee Constables Stipend Hike
  • ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ రూ.12,500కు పెంపు
  • ఇప్పటివరకు రూ.4,500 గా ఉన్న స్టైఫండ్
  • కొత్తగా ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందించిన సీఎం, డిప్యూటీ సీఎం
శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి స్టైఫండ్‌ను ప్రస్తుతం ఉన్న రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణకే తమ కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత పోలీసులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. అనేక కోర్టు కేసులను అధిగమించి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. 

మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 6,014 మంది ఎంపికయ్యారని, వారిలో 5,757 మంది శిక్షణకు హాజరయ్యారని వివరించారు. వీరిలో 3,343 మంది సివిల్, 2,414 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు. గతంలో తాను అమలు చేసిన 33 శాతం రిజర్వేషన్ల వల్లే నేడు 993 మంది మహిళలు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల నుంచి 183 మంది ఆదివాసీ యువత ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలతో పాటు ఈ నియామకాల పండుగ కూడా అందరిలో సంతోషాన్ని నింపిందని ఆయన వ్యాఖ్యానించారు.

పారదర్శకంగా నియామక ప్రక్రియ

గత ప్రభుత్వం కేవలం మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చిందని, తాము రికార్డు సమయంలో కేవలం 60 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని చంద్రబాబు తెలిపారు. అవినీతికి తావు లేకుండా, మానవ ప్రమేయాన్ని తగ్గిస్తూ పూర్తిగా టెక్నాలజీ సాయంతో పారదర్శకంగా ఎంపికలు పూర్తి చేశామన్నారు. డిజిటల్ మీటర్లతో కొలతలు, ఆర్ఎఫ్ఐడీ చిప్‌లతో పరుగు పందెం నిర్వహించి లైవ్‌గా రికార్డ్ చేశామని వివరించారు. 

రోడ్డు లేదని కానిస్టేబుల్ అభ్యర్థి చెప్పగా, పవన్ వెంటనే స్పందించారు!

సందర్భంగా కానిస్టేబుల్‌గా ఎంపికైన ఓ గిరిజన యువకుడు బాబూరావు తన గ్రామానికి రోడ్డు వేయాలని కోరగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి అల్లూరి జిల్లా జీకేవీధిలోని వెలుగురాతిబండ-తిమ్మల బండ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి రూ.3.90 కోట్లు మంజూరు చేయడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు పోలీస్ శాఖలో 23,676 ఉద్యోగాలు ఇచ్చానని, రాష్ట్రంలోని 58 వేల మంది కానిస్టేబుళ్లలో దాదాపు 24 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది తానేనని గర్వంగా చెప్పారు.

నేరస్తులపై కఠినంగా ఉండండి

రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రెడిక్షన్, ప్రివెన్షన్, ప్రొటెక్షన్ (పీపీపీ) విధానాన్ని అవలంబించాలని సూచించారు. గత పాలనలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో వివేకా హత్య కేసు, పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులే ఉదాహరణలని విమర్శించారు. గూగుల్ టేకవుట్ వంటి సాంకేతికతతోనే వివేకా కేసులో నిజాలు బయటకు వచ్చాయన్నారు. 

తాను సైతం నక్సలైట్ల దాడి నుంచి బయటపడ్డానని, ప్రాణాపాయంలోనూ విధినిర్వహణకే ప్రాధాన్యత ఇచ్చానని గుర్తుచేశారు. గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించి రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా నిలబెట్టాలని ఆకాంక్షించారు. 'సూపర్ సిక్స్' హామీలను సూపర్ హిట్ చేశామని, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అంతకుముందు, వేదికపై ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుస్తూ కొత్త కానిస్టేబుళ్లకు అభివాదం చేశారు. టాపర్లుగా నిలిచిన వారి కుటుంబ గాథల దృశ్యమాలికను చూసి సీఎం చలించిపోయారు.
Chandrababu Naidu
AP Police
Constable Stipend
Andhra Pradesh Police Recruitment
Pawan Kalyan
APSP
Police Jobs AP
Mangalagiri
Vangalapudi Anitha
AP Government

More Telugu News