Venkata Ramanan: బెంగళూరు రోడ్డుపై అమానవీయ ఘటన... వివరాలు ఇవిగో!

Heart Attack Victim Dies Due to Negligence in Bangalore
  • ఛాతీ నొప్పితో బాధపడుతున్న భర్తను బైక్‌పై ఆసుపత్రులకు తిప్పిన భార్య
  • వైద్యం నిరాకరించిన ఆసుపత్రులు
  • ప్రమాదం జరిగి రోడ్డుపై పడిపోయినా కనికరించని వాహనదారులు
  • సమయానికి సాయం అందక ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
  • విషాదంలోనూ ఆ కుటుంబం నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచిన వైనం
కర్ణాటక రాజధాని బెంగళూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తను కాపాడుకునేందుకు ఓ భార్య చేసిన పోరాటం విఫలమైంది. ఒకవైపు ఆసుపత్రుల నిర్లక్ష్యం, మరోవైపు జనాల ఉదాసీనత కారణంగా ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.

వివరాల్లోకి వెళితే.. సౌత్ బెంగళూరు బాలాజీ నగర్‌లో నివసించే వెంకటరమణన్ (34) అనే మెకానిక్‌కు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. గతంలో స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి వేగంగా క్షీణించింది. వెంటనే స్పందించిన ఆయన భార్య, తన భర్తను బైక్‌పై ఎక్కించుకుని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అక్కడ వైద్యులు అందుబాటులో లేరని సిబ్బంది తిప్పి పంపారు.

దీంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ ఈసీజీ తీసి అతనికి స్వల్ప గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. కానీ, అత్యవసర చికిత్స అందించకుండా, కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయకుండా జయనగర్‌లోని శ్రీ జయదేవ కార్డియావస్కులర్ సైన్సెస్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు.

నిస్సహాయ స్థితిలో ఆ దంపతులు మళ్లీ బైక్‌పైనే బయలుదేరారు. మార్గమధ్యలో వారి బైక్ ప్రమాదానికి గురైంది. దీంతో వెంకటరమణన్ రోడ్డుపై పడిపోయి నొప్పితో విలవిల్లాడారు. ఆ సమయంలో ఆయన భార్య రోడ్డుపై వెళుతున్న ప్రతీ వాహనాన్ని చేతులు జోడించి సహాయం కోసం వేడుకుంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, కార్లు, టెంపో, బైక్‌లు ఆగకుండా వెళ్లిపోయాయి.

కొంతసేపటి తర్వాత ఓ క్యాబ్ డ్రైవర్ ఆగి, వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశాడు. కానీ, అప్పటికే ఆలస్యమైంది. ఆసుపత్రికి చేర్చేసరికే వెంకటరమణన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి ఐదేళ్ల కుమారుడు, 18 నెలల కుమార్తె ఉన్నారు. అతడి తల్లికి ఉన్న ఆరుగురు సంతానంలో ఐదుగురు గతంలోనే చనిపోగా, మిగిలిన ఏకైక కుమారుడు కూడా ఇప్పుడు మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇంతటి దుఃఖంలోనూ ఆ కుటుంబం మానవత్వాన్ని చాటుకుంది. వెంకటరమణన్ కళ్లను దానం చేసి ఇతరులకు చూపును ప్రసాదించింది.
Venkata Ramanan
Bangalore road accident
heart attack
hospital negligence
road accident
cardiovascular sciences
private hospital
Jayanagar
Karnataka
Bengaluru

More Telugu News