Statue of Liberty: బ్రెజిల్‌లో బలమైన గాలులకు నేలకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా.. ఇదిగో వీడియో!

Statue of Liberty Replica Collapses in Brazil Due to Strong Winds
  • బ్రెజిల్‌లో కుప్పకూలిన 24 మీటర్ల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిమ
  • భారీ ఈదురు గాలుల కారణంగా నేలకొరిగిన విగ్రహం
  • ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన వీడియో
బ్రెజిల్‌లో భారీ ఈదురు గాలుల కారణంగా ఓ షాపింగ్ స్టోర్ వెలుపల ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా విగ్రహం కుప్పకూలింది. గ్వాబా నగరంలో నిన్న‌ ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోర్టో అలెగ్రే మెట్రోపాలిటన్ ప్రాంతంలోని 'హవన్' రిటైల్ స్టోర్ కార్ పార్కింగ్ ఏరియాలో ఈ 24 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఆ ప్రాంతంలో గంటకు 90 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన గాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి తట్టుకోలేక విగ్రహం నెమ్మదిగా పక్కకు ఒరిగి, పార్కింగ్‌లో ఉన్న వాహనాల సమీపంలో కూలిపోయింది.

ఈ ఘటనపై హవన్ స్టోర్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో నిర్దేశించిన సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగానే విగ్రహాన్ని నిర్మించామని, అయినప్పటికీ అంతర్గత విచారణ జరుపుతున్నామని తెలిపింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. బ్రెజిల్ అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానిక అధికారులు వేగంగా స్పందించారని గ్వాబా మేయర్ మార్సెలో మరానటా ప్రశంసించారు.

వాతావరణ శాఖ ముందుగానే ఈ ప్రాంతంలో తుపాను హెచ్చరికలు జారీ చేసింది. శీతల గాలుల ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇవాళ్టి నుంచి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Statue of Liberty
Brazil
Guaba
windstorm
Havan store
statue collapse
Brazil storm
weather
viral video
shopping store

More Telugu News