Potti Sreeramulu: పొట్టిశ్రీరాములు యావత్ తెలుగు ప్రజల ఆస్తి: సీఎం చంద్రబాబు

Chandrababu Declares Potti Sreeramulu Asset to All Telugu People
  • పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని 'డే ఆఫ్ శాక్రిఫైస్'గా ప్రకటన
  • అమరావతిలో 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి
  • గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అపహాస్యం చేసింది
  • పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పేరు 'వాసవీ పెనుగొండ'గా మార్పు
  • పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన సీఎం
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ఇకపై అధికారికంగా 'డే ఆఫ్ శాక్రిఫైస్' (త్యాగాల దినం)గా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలో 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' నిర్మిస్తామని వెల్లడించారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్యం కోసం, ఆ తర్వాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు పొట్టిశ్రీరాములు. పాలకుల వివక్షకు గురైన తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారు. ఆయన కృషితోనే 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం, 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. కొందరు ఈ తేదీలపై అనవసర రాజకీయం చేస్తున్నందునే, ఆయన ఆత్మార్పణ చేసిన రోజునే త్యాగాలకు గుర్తుగా నిర్వహించాలని నిర్ణయించాం" అని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, యావత్ తెలుగు ప్రజల ఆస్తి, గుండె చప్పుడు అని కొనియాడారు.

పొట్టిశ్రీరాములు స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో స్మృతి వనంతో పాటు, చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచిన భవనాన్ని, నెల్లూరులోని నివాసాన్ని మెమోరియల్స్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ గతంలో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టిశ్రీరాములు పేరు పెట్టారని, తాను కూడా నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు  పేరు పెట్టానని గుర్తుచేశారు.

మహా కుట్ర చేశారు

గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "మూడు రాజధానుల పేరుతో మహా కుట్ర పన్నారు. అసలు రాజధానే లేకుండా చేసి ప్రపంచం ముందు రాష్ట్రాన్ని అపహాస్యం చేశారు. కనీసం రాజధాని పేరు చెప్పుకోలేని దుస్థితి కల్పించారు. కానీ ఇప్పుడు మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నాం" అని అన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని, 18 నెలల్లోనే రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు.

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ విధానం వల్లే రహదారులు, విమానాశ్రయాలు అభివృద్ధి చెందాయని, ఇది పార్లమెంటరీ కమిటీ కూడా సమర్థించిన ఉత్తమ విధానమని అన్నారు. కాలేజీలు ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పేరును 'వాసవీ పెనుగొండ'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తూ, తెలుగు జాతిని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
Potti Sreeramulu
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Day of Sacrifice
Telugu People
Statue of Sacrifice
Telugu Pride
Andhra State
Political News

More Telugu News