Nara Lokesh: భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీ.. రేపు ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్‌ చేతుల మీదుగా శ్రీకారం

Nara Lokesh Inaugurates Aviation Aerospace Defense EduCity Project in Bhogapuram
  • విమానయాన, రక్షణ రంగాల్లో నైపుణ్యాల కొరత తీర్చ‌డ‌మే లక్ష్యం
  • 160 ఎకరాల్లో జీఎంఆర్ మాన్సాస్ ఆధ్వర్యంలో నిర్మాణం
  • అంతర్జాతీయ వర్సిటీలతో విద్యా, ఆవిష్కరణల హబ్‌గా రూపకల్పన
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ (AAD) ఎడ్యుకేషన్ సిటీని విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనుంది. 'జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ' పేరుతో రానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రేపు విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

దేశంలో విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల మార్కెట్ విలువ 2034 నాటికి 57 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే, ఈ వేగానికి తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో లేవు. దేశం ప్రస్తుతం పైలట్లు (12-15%), ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, భద్రతా నిపుణుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఏటా కేవలం 8 వేల మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు మాత్రమే పట్టభద్రులవుతున్నారు. ఇది మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 0.5 శాతమే కావడం గమనార్హం.

ఈ నైపుణ్యాల కొరతను అధిగమించే లక్ష్యంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 160 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎడ్యుసిటీని నిర్మించనున్నారు. ఇది ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అంకితమైన దేశంలోని మొట్టమొదటి సమీకృత విద్యా, ఆవిష్కరణల కేంద్రంగా (ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్) నిలవనుంది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్‌లు, పరిశోధన కేంద్రాలు, స్టార్టప్‌ల కోసం ఇంక్యుబేషన్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

మేకిన్ ఇండియా, జాతీయ విద్యా విధానం (NEP-2020) వంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ భారతదేశాన్ని ఏవియేషన్, ఏరోస్పేస్ విద్య, ఆవిష్కరణలలో ప్రపంచస్థాయి లీడర్ గా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Nara Lokesh
Bhogaapuram
Aviation EduCity
Aerospace
Defense Education
GMR Mansaas EduCity
Andhra Pradesh
Skill Development
Education Hub
Visakhapatnam

More Telugu News