Chandrababu Naidu: ఏపీలో హార్ట్‌ఫుల్‌నెస్ విస్తరణ.. దాజీతో సమాలోచనలు జరిపిన సీఎం

Chandrababu Naidu Visits Kanha Shanti Vanam Heartfulness Center
  • రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతి వనాన్ని సందర్శించిన చంద్రబాబు
  • శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీతో ప్రత్యేకంగా సమావేశం
  • ఏపీలో హార్ట్‌ఫుల్‌నెస్ కార్యాలయం ఏర్పాటుపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగారెడ్డి జిల్లా చేగూరులోని ప్రఖ్యాత కన్హా శాంతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ అధ్యక్షుడు కమలేశ్ డి పటేల్ (దాజీ) ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, దాజీ ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.

ఈ భేటీలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌లో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే విషయంపై చంద్రబాబు దాజీతో సమాలోచనలు జరిపారు. కన్హా శాంతి వనంలో హార్ట్‌ఫుల్‌నెస్ చేపడుతున్న కార్యక్రమాల గురించి దాజీ సీఎంకు వివరించారు. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణం, సుస్థిర వ్యవసాయం, ధ్యానం, యోగా శిక్షణ వంటి అంశాలపై జరుగుతున్న కృషిని ఆయన చంద్రబాబుకు తెలిపారు. శాంతి వనంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో శ్రీరామచంద్ర మిషన్ ఈ శాంతి వనాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్‌గా ఇది గుర్తింపు పొందింది. 8 లక్షలకు పైగా వృక్ష జాతులతో జీవవైవిధ్య కేంద్రంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడి హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్ ద్వారా 'కౌశలం' పేరుతో యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Heartfulness
Kanha Shanti Vanam
Daaji
Kamlesh Patel
Meditation Center
Sri Ramachandra Mission
Skill Development
Sustainable Agriculture

More Telugu News