Lionel Messi: ఢిల్లీలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ.. కోటను తలపిస్తున్న హోటల్.. కోట్లు పలికిన మీట్ అండ్‌ గ్రీట్!

Rs 1 Crore For Handshake High Security Delhi Rolls Out Red Carpet For Lionel Messi
  • ఢిల్లీకి చేరుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ
  • లీలా ప్యాలెస్ హోటల్‌ను కోటలా మార్చిన భద్రతా సిబ్బంది
  • మెస్సీతో భేటీకి కోటి రూపాయలు వెచ్చించిన కార్పొరేట్లు
  • సీజేఐ, ఎంపీలు, భారత క్రీడాకారులతో ప్రత్యేక సమావేశాలు
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన కొన్ని గంటల భారత పర్యటన కోసం ఈరోజు ఉదయం 10:45 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బస చేయనున్న చాణక్యపురిలోని 'ది లీలా ప్యాలెస్' హోటల్ వద్ద అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. మెస్సీ, ఆయన బృందం కోసం హోటల్‌లో ఒక ఫ్లోర్ మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించారు.

మెస్సీ బస చేయనున్న ప్రెసిడెన్షియల్ సూట్‌ల రోజువారీ అద్దె రూ. 3.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆయన బసకు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా హోటల్ సిబ్బందికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో మెస్సీ పర్యటనల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హోటల్ పరిసర ప్రాంతాలను హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చారు.

ఇక, ఈ పర్యటనలో భాగంగా ఎంపిక చేసిన కార్పొరేట్, వీఐపీ అతిథుల కోసం హోటల్‌లో ఒక 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్ ఐకాన్‌ను కలిసే ఈ అవకాశం కోసం కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏకంగా రూ. 1 కోటి వరకు వెచ్చించినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.

ఈ పర్యటనలో భాగంగా మెస్సీ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), పలువురు పార్లమెంటేరియన్లు, క్రికెటర్లతో పాటు ఒలింపిక్, పారాలింపిక్ పతక విజేతలతో సమావేశం కానున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొని, కొంతమంది భారత క్రికెటర్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత పురానా ఖిలాలో అడిడాస్ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ శర్మ, నిఖత్ జరీన్, సుమిత్ అంటిల్, నిషాద్ కుమార్ వంటి భారత క్రీడా ఛాంపియన్లను కలుస్తారు. తన పర్యటన ముగించుకుని సాయంత్రం 6:15 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి, రాత్రి 8 గంటలకు తిరిగి పయనమవుతారు.
Lionel Messi
Messi Delhi visit
Lionel Messi India
FIFA World Cup
The Leela Palace
Meet and Greet event
Arun Jaitley Stadium
Indian Parliament
Rohit Sharma
Nikhat Zareen

More Telugu News