India AI: ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం

India emerges as worlds 3rd most competitive AI power
  • స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ వెల్లడి
  • అగ్రస్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా
  • యూకే, జపాన్, జర్మనీ వంటి దేశాలను అధిగమించిన ఇండియా
  • టాలెంట్ విభాగంలో భారత్‌కు టాప్-3లో చోటు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వమున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేసిన 'గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్' ర్యాంకింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఈ ఘనతకు కారణమని నివేదిక పేర్కొంది.

ఈ జాబితాలో 78.6 స్కోర్‌తో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 36.95 స్కోర్‌తో చైనా రెండో స్థానంలో నిలిచింది. భారత్ 21.59 స్కోర్‌తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూకే, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలను భారత్ అధిగమించడం విశేషం.

పరిశోధన, అభివృద్ధి (R&D), టాలెంట్ లభ్యత, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు వంటి అనేక కీలక అంశాలను విశ్లేషించి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ ర్యాంకులను కేటాయించింది. ముఖ్యంగా 'టాలెంట్' విభాగంలో భారత్ ప్రపంచంలోని టాప్-3 దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలోని ఇంజనీర్లు, డెవలపర్‌ల భారీ సంఖ్య ఇందుకు దోహదపడింది.

తక్కువ-మధ్య ఆదాయ దేశాల కేటగిరీలో ఈ జాబితాలో ఇంత ఉన్నత స్థానంలో నిలిచిన ఏకైక దేశం భారత్ కావడం గమనార్హం. ఏఐ రంగంలో భారత్‌లో పెరుగుతున్న పెట్టుబడులు, బలమైన స్టార్టప్ వ్యవస్థ, విస్తరిస్తున్న పరిశోధనలకు ఈ ర్యాంకింగ్ అద్దం పడుతోంది. అయితే, ఏఐ అభివృద్ధిలో దేశాల మధ్య అంతరం పెరిగితే ప్రపంచ అసమానతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.
India AI
Artificial Intelligence
Stanford University
Global AI Vibrancy Tool
AI Ranking
Technology
Research and Development
Talent Pool
AI Investment
Indian Engineers

More Telugu News