Nara Brahmani: నారా బ్రహ్మణికి 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డు

Nara Brahmani Receives Most Powerful Women in Business Award
  • బిజినెస్ టుడే 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్' అవార్డు అందుకున్న నారా బ్రహ్మణి
  • ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం స్వీకరణ
  • శాశ్వత సంస్థల నిర్మాణమే నిజమైన నాయకత్వమని వెల్లడి
  • భారత్‌లో మహిళా నేతలను ప్రోత్సహించడంపై బిజినెస్ టుడేకు ప్రశంస
  • హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బ్రహ్మణి బాధ్యతలు
ఏపీ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ 'బిజినెస్ టుడే' ఏటా అందించే 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబైలో నిన్న సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బ్రహ్మణి ఈ అవార్డును స్వీకరించారు.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడిస్తూ, ఈ గుర్తింపు దక్కడం పట్ల గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకత్వంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "నాయకత్వం అంటే... శాశ్వతంగా నిలిచే సంస్థలను నిర్మించడం, బాధ్యతాయుతంగా విలువను సృష్టించడం, ఈ క్రమంలో ప్రజలను శక్తివంతం చేయడమే" అని ఆమె పేర్కొన్నారు.

ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు 'బిజినెస్ టుడే'కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భారతదేశవ్యాప్తంగా మహిళా నేతలను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. ఎన్‌ఎస్‌ఈ ఇండియాలో తన అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు.

నారా బ్రహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు, తన తండ్రి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టులో బోర్డు మెంబర్‌గా కూడా సేవలందిస్తున్నారు.
Nara Brahmani
Heritage Foods
Most Powerful Women in Business
Nara Lokesh
Business Today Award
Basavatarakam Cancer Hospital
Nandamuri Balakrishna
NSE India

More Telugu News