Narendra Modi: తిరువనంతపురంలో బీజేపీ చారిత్రాత్మక విజయం.. స్పందించిన మోదీ, శశిథరూర్

Narendra Modi Reacts to BJP Victory in Thiruvananthapuram
  • క్షేత్రస్థాయిలో కార్యకర్తల కృషి వల్లే బీజేపీ గెలిచిందన్న మోదీ
  • కేరళ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించారని వ్యాఖ్య
  • నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ ఎన్నికలు నిదర్శనమన్న శశిథరూర్
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేరళ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మలుపు అని ఆయన అభివర్ణించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్‌ను ఓడించడానికి క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలు చేసిన కృషి కారణమని ఆయన పేర్కొన్నారు.

తిరువనంతపురంలో గెలుపు కోసం కృషి చేసిన బీజేపీ కార్యకర్తలను ఆయన అభినందించారు. కేరళ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ఇదే విషయాన్ని తిరువనంతపురం ప్రజలు విశ్వసించారని అన్నారు. తిరువనంతపురం అభివద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ చేస్తున్న అక్రమాలను తాను చాలాసార్లు ప్రశ్నించానని, వారి పాలన నుంచి ప్రజలు బయటపడాలని కోరుకున్నారని అన్నారు. ఈ ఫలితాలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 101 వార్డుల్లో బీజేపీ 50 స్థానాల్లో గెలుపొందగా, ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు.
Narendra Modi
Thiruvananthapuram
Kerala BJP
Kerala Politics
LDF
UDF
Shashi Tharoor

More Telugu News