Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

Anil Chauhan Actions Win Wars Not Words
  • ప్రపంచంలోని పలు ప్రాంతాలు అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయని వ్యాఖ్య
  • భారత్‌కు స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందన్న అనిల్ చౌహాన్
  • విధుల్లో నిర్లక్ష్యం పనికి రాదని, ఎవరు చేసే తప్పులకు వారే బాధ్యులన్న అనిల్ చౌహాన్
మాటలతో యుద్ధాలను గెలవలేమని, స్పష్టమైన చర్యల ద్వారానే విజయం సాధ్యమని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ, తామే విజయం సాధించామని ఆ దేశం ప్రకటనలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

శనివారం హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణ, ప్రణాళిక, వేగంగా కచ్చితమైన నిర్ణయాలను అమలు చేయడం ద్వారానే నిజమైన దృఢత్వం లభిస్తుందని అన్నారు. బలహీన వ్యవస్థల కారణంగా ప్రపంచంలోని పలు ప్రాంతాలు అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయని, దానివల్ల తరుచూ అభద్రత, ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తుతున్నాయని పాకిస్థాన్‌కు పరోక్షంగా బదులిచ్చారు.

అదే సమయంలో, మనకు స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండటం, సాయుధ దళాల నైపుణ్యం, దృఢమైన వ్యవస్థలు భారత్‌కు బలమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న మార్పులను భారత బలగాలు అందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు. ఈ అకాడమీలో క్యాడెట్లకు అత్యుత్తమ శిక్షణ అందిందని కొనియాడారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితులనూ ఉపేక్షించేది లేదని, ఎవరి తప్పులకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకప్పుడు యుద్ధాలు క్షేత్రస్థాయిలో జరిగేవని, ఇప్పుడు సాంకేతికతదే కీలక పాత్ర అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేస్తూ, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Anil Chauhan
CDS Anil Chauhan
Operation Sindoor
Indian Armed Forces
Air Force Academy

More Telugu News