Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ

Pawan Kalyan Ustaad Bhagat Singh First Song Lyric Sheet Launch
  • అభిమానుల చేతుల మీదుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట
  • ఒకేసారి లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణకు ప్లాన్
  • 'దేఖ్లేంగే సాలా' అంటూ రాబోతున్న పవన్ కల్యాణ్
  • ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు పాట విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా బృందం సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సినిమా చరిత్రలో తొలిసారిగా, అభిమానుల చేతుల మీదుగా తొలి పాట లిరిక్ షీట్‌ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు లక్ష మంది అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది.

'దేఖ్ లేంగే సాలా' అంటూ సాగే ఈ పాట లిరిక్ షీట్‌ను లాంచ్ చేసేందుకు అభిమానులు చిత్ర బృందం సూచించిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొన్ని సులభమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. లక్ష మంది తమ ఎంట్రీలను నమోదు చేసిన వెంటనే, అదే వెబ్‌సైట్‌లో లిరిక్ షీట్ ప్రత్యక్షమవుతుంది. ఈ వినూత్న ప్రచారంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాటను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, 'దేఖ్ లేంగే సాలా' పాటకు భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్-దేవిశ్రీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
Pawan Kalyan
Ustaad Bhagat Singh
Harish Shankar
Sreeleela
మైత్రీ మూవీ మేకర్స్
దేవిశ్రీ ప్రసాద్
టాలీవుడ్ న్యూస్
Tollywood movie
Dekh Lenge Saala
Bhaskarabhatla

More Telugu News