Lionel Messi: మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కోల్‌కతాలో కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్

Lionel Messi Honeymoon Postponed for Messi Kolkata Visit Viral
  • భారత్‌కు చేరుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ
  • కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అర్ధరాత్రి ఘన స్వాగతం పలికిన అభిమానులు
  • మెస్సీ కోసం హనీమూన్ రద్దు చేసుకున్నానంటూ ఓ మహిళ ప్లకార్డ్
  • హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లో మెస్సీ పర్యటన
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచకప్ విజేత లియోనెల్ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టారు. మూడు రోజుల "గోట్" (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) టూర్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఆయన కోల్‌కతా చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు అర్ధరాత్రి వేళ కూడా వందలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తారు. వీరిలో ఓ కొత్త పెళ్లికూతురు ప్రదర్శించిన ప్లకార్డ్ అందరి దృష్టిని ఆకర్షించి, సోషల్ మీడియాలో వైరల్ అయింది.

"గత శుక్రవారమే నాకు పెళ్లయింది. కానీ, మెస్సీని చూడటం కోసం మా హనీమూన్‌ను రద్దు చేసుకున్నాం" అని రాసి ఉన్న ప్లకార్డ్‌ను ఆమె పట్టుకుంది. దీనిపై ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "నేను 2010 నుంచి మెస్సీకి వీరాభిమానిని. ఆయన మా నగరానికి వస్తున్నారని తెలిసి, నా భర్తతో మాట్లాడి హనీమూన్‌ను వాయిదా వేసుకున్నాను. 2011లో ఆయన వచ్చినప్పుడు చూసే అవకాశం రాలేదు. అప్పుడు మేము చిన్నవాళ్లం. ఈసారి ఆ ఛాన్స్ వదులుకోలేం" అని ఆమె పేర్కొంది.

ఇతర అభిమానులు కూడా అంతే ఉత్సాహాన్ని చూపారు. "రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నాం. అవసరమైతే మరో నాలుగు గంటలైనా వేచి ఉంటాం. ఆయనొక మెజీషియన్. ఒక్కసారి చూస్తే చాలు" అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 2011లో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఆడిన మెస్సీ, మళ్లీ ఇన్నేళ్లకు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ టూర్‌లో భాగంగా ఆయన కోల్‌కతాతో పాటు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నారు.
Lionel Messi
Messi India Visit
Argentina Football
Kolkata
Honeymoon Postponed
Football Fan
Viral Placard
Salt Lake Stadium
Hyderabad
Mumbai

More Telugu News