H-1B Visa: హెచ్‌-1బీ వీసా ఫీజుపై ట్రంప్ సర్కారుకు షాక్.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు

Donald Trump Administration Faces H1B Visa Fee Lawsuit from 20 States
  • ట్రంప్ సర్కారు నిర్ణయం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కోర్టులో దావా
  • ఈ ఫీజు వల్ల విద్య, వైద్య రంగాల్లో సిబ్బంది కొరత పెరుగుతుందని ఆందోళన
  • ఈ న్యాయ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న కాలిఫోర్నియా, మసాచుసెట్స్ రాష్ట్రాలు
అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్ సర్కారు తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కొత్తగా హెచ్‌-1బీ (H-1B) వీసా పిటిషన్లపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజు విధించడాన్ని వ్యతిరేకిస్తూ 20 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ విధానం చట్టవిరుద్ధమని, ప్రజా సేవలకు ఇది తీవ్ర ఆటంకం కలిగిస్తుందని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగాయి.

అధ్యక్షుడు ట్రంప్ 2025 సెప్టెంబర్ 19న జారీ చేసిన ఆదేశాల మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ కొత్త ఫీజును అమలులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు వంటి సంస్థలు తీవ్రంగా నష్టపోతాయని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ దావాకు నాయకత్వం వహిస్తున్న కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా మాట్లాడుతూ, "ఈ అక్రమ ఫీజు వల్ల ప్రభుత్వ సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. కీలక రంగాల్లో ఇప్పటికే ఉన్న సిబ్బంది కొరత మరింత పెరుగుతుంది" అని అన్నారు.

ఈ ఫీజును విధించే అధికారం ప్రభుత్వానికి లేదని, ఇది అమెరికా రాజ్యాంగాన్ని, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్‌ను ఉల్లంఘించడమేనని రాష్ట్రాలు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ప్రస్తుతం హెచ్‌-1బీ పిటిషన్లకు 960 డాల‌ర్ల నుంచి 7,595 డాల‌ర్ల వరకు మాత్రమే ఫీజులు ఉన్నాయి.

ఈ కొత్త నిర్ణయం వల్ల విద్య, వైద్య రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడం మరింత కష్టమవుతుందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. అలాగే 2036 నాటికి అమెరికాలో 86,000 మంది వైద్యుల కొరత ఏర్పడవచ్చని అంచనాలున్నాయి. భారత్ నుంచి వెళ్లే టెక్ నిపుణులు, వైద్యులకు హెచ్‌-1బీ వీసా అత్యంత కీలకమైన మార్గంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. కాలిఫోర్నియా, మసాచుసెట్స్ సహా న్యూయార్క్, న్యూజెర్సీ, అరిజోనా వంటి రాష్ట్రాలు ఈ దావాలో పాలుపంచుకున్నాయి.
H-1B Visa
Donald Trump
US Visa Fee
Trump Administration
H1B Petition
United States
Immigration
Visa fees
California
Rob Bonta

More Telugu News