Pakeeza: వృద్ధాశ్రమంలో చేరిన హాస్యనటి 'పాకీజా'

Pakeeza Telugu Actress Joins Old Age Home
  • కోనసీమ జిల్లా ఆత్రేయపురం ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న పాకీజా 
  • ఆదుకున్న మోహన్ బాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్ కుటుంబాలు
  • పింఛను, రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఒకప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటి వాసుకి (పాకీజా) నేడు దీనస్థితిలో వృద్ధాశ్రమంలో చేరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. 'అసెంబ్లీ రౌడీ', 'పెదరాయుడు', 'మేజర్ చంద్రకాంత్' వంటి చిత్రాల్లో పాకీజా పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు.
 
తమిళనాడుకు చెందిన వాసుకి, 1991లో మోహన్ బాబు నటించిన 'అసెంబ్లీ రౌడీ' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినా, కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆమె దుర్భర పరిస్థితి సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడంతో శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు స్పందించి ఆమెకు ఆశ్రయం కల్పించారు.
 
ఈ సందర్భంగా వాసుకి మాట్లాడుతూ..  తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన గురువు మోహన్ బాబు కుటుంబం రుణం తీర్చుకోలేనిదన్నారు. ఆయన కుమారుడు మంచు విష్ణు తనకు కంటికి శస్త్రచికిత్స చేయించారని తెలిపింది. ప్రముఖ నటుడు చిరంజీవి, ఆయన సోదరులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు కలిసి రూ.4 లక్షల ఆర్థిక సాయం చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా సహాయపడుతున్నారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు పింఛను, బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆశ్రమంలో చేరాక తన ఆరోగ్యం కుదుటపడిందని, ఇక్కడి వృద్ధులకు సేవ చేస్తున్నానని వాసుకి పేర్కొన్నారు.
Pakeeza
Vasuki
actress
Telugu actress
old age home
Mohan Babu
Chiranjeevi
Pawan Kalyan
Tollywood

More Telugu News