Rahul Gandhi: నేడు మెస్సీ షో... హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi to Attend Messi Football Match in Hyderabad
  • ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్
  • ఈ మ్యాచ్‌ను వీక్షించడానికే రాహుల్ హైదరాబాద్ పర్యటన
  • 2,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన నగరానికి విచ్చేస్తున్నారు. ఈ హై-ప్రొఫైల్ కార్యక్రమానికి ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.
 
షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ గాంధీ ఈరోజు సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి బయల్దేరి, రాత్రి 7:15 గంటలకు మైదానానికి వస్తారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొననున్నారు.
 
ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. మ్యాచ్ కోసం 2,500 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ప్రేక్షకుల సౌకర్యార్థం 34 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు ఆయన వివరించారు. మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ వెల్లడించారు.
Rahul Gandhi
Hyderabad
Lionel Messi
Revanth Reddy
Telangana
Congress
Football Match
Uppal Stadium
Friendly Match
Messi GOAT India Tour

More Telugu News