Telangana Weather: హైదరాబాద్‌పై చలి పంజా.. 7 ఏళ్ల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు

Telangana Freezes as Temperatures Drop to Record Lows
  • రాష్ట్రాన్ని వణికిస్తున్న తీవ్రమైన చలి
  • సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత
  • హైదరాబాద్‌లో 7 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • 28 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు
  • పొగమంచు కారణంగా వాహనదారులకు తప్పని ఇబ్బందులు
తెలంగాణ రాష్ట్రం చలి గుప్పిట్లో చిక్కుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం మొదలై ఉదయం 8 గంటలు దాటినా కొనసాగుతుండటంతో జనజీవనంపై ప్రభావం పడుతోంది.

రాజధాని హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఏడేళ్ల తర్వాత నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం శేరిలింగంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మౌలాలిలో 7.1, రాజేంద్రనగర్‌లో 7.7, గచ్చిబౌలిలో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గురువారం రాత్రి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయంటే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2014లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైన 1.8 డిగ్రీల రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాబోయే మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఈ నెల 18 నుంచి 22 మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చలికి తోడు ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Telangana Weather
Telangana
Hyderabad Weather
Cold Wave
Weather Forecast
Sangareddy
Lowest Temperature
Hyderabad Temperature
Telangana Coldest Day

More Telugu News