Stephen Venacious: మీ పిల్లలను డేటా పాయింట్లుగా మారనివ్వొద్దు: నిపుణుల హెచ్చరిక

Stephen Venacious Warns Against Turning Children into Data Points
  • పిల్లల భద్రత కోసం వస్తున్న కొత్త చట్టాలు గోప్యతకు ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిక
  • వయసు నిర్ధారణ కోసం వ్యక్తిగత డేటా అడగడంపై తీవ్ర ఆందోళన
  • డేటా సేకరించకుండానే ఆన్‌లైన్ వేధింపులను గుర్తించే టెక్నాలజీలు ఉన్నాయన్న నిపుణులు
  • భారత్‌లో పిల్లలపై సైబర్ నేరాలు 32 శాతం పెరిగాయని నీతి ఆయోగ్ నివేదిక
  • భద్రత పేరుతో పిల్లలపై నిఘా పెట్టవద్దని యూనిసెఫ్ సూచన
పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కఠినమైన చట్టాలు, వారి గోప్యతకు భంగం కలిగించి కొత్త ప్రమాదాలకు గురిచేసే అవకాశం ఉందని చైల్డ్-సేఫ్టీ టెక్నాలజిస్ట్ స్టీఫెన్ ఆంటోనీ వెనాన్సియస్ హెచ్చరించారు. వయసు నిర్ధారణ పేరుతో పిల్లల వ్యక్తిగత డేటాను సేకరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఆన్‌లైన్‌లో ఆడుకోవడానికి లేదా నేర్చుకోవడానికి ఒక పిల్లాడి ముఖాన్ని గానీ, గుర్తింపును గానీ అడిగితే, మనం అప్పుడే వాళ్లను బలి చేసినట్టు" అని స్టీఫెన్ అన్నారు. భద్రతా చర్యలు పిల్లల గోప్యతను దెబ్బతీసేలా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా, పిల్లల నుంచి ఫొటోలు, గుర్తింపు పత్రాలు వంటి సున్నితమైన సమాచారం సేకరించకుండానే ఆన్‌లైన్‌లో వేధింపులను, ప్రమాదకర ప్రవర్తనను గుర్తించే ఒక టెక్నాలజీని తాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పిల్లల కోసం సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకొస్తున్నాయి. దీనిపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టాల వల్ల కంపెనీలు పిల్లల నుంచి పెద్ద మొత్తంలో సున్నితమైన డేటాను సేకరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

భారత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2021-22 మధ్య పిల్లలపై సైబర్ నేరాలు 32 శాతం పెరిగాయని నీతి ఆయోగ్ మద్దతుతో వెలువడిన ఒక నివేదిక పేర్కొంది. సైబర్‌బుల్లీయింగ్, ఆన్‌లైన్ వేధింపులు, గోప్యతా ఉల్లంఘనలు పెరుగుతున్నాయని తెలిపింది.

ఇదే అంశంపై యూనిసెఫ్ కూడా స్పందిస్తూ, కఠినమైన ఆంక్షలు, వయసు ఫిల్టర్లు వికటించే ప్రమాదం ఉందని డిసెంబర్ 9న ఒక ప్రకటనలో హెచ్చరించింది. భద్రత పేరుతో పిల్లల హక్కులను కాలరాయకుండా, వారికి డిజిటల్ అక్షరాస్యత కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించింది. "పిల్లలను సమాచారాన్ని అందించే డేటా పాయింట్లుగా మార్చకుండా వారి బాల్యాన్ని కాపాడటం, భద్రత-గోప్యత రెండూ కలిసే ఉంటాయని నిరూపించడం మన ముందున్న కర్తవ్యం" అని స్టీఫెన్ వెనాన్సియస్ పేర్కొన్నారు.
Stephen Venacious
child safety
online privacy
data protection
cybercrime
cyberbullying
NITI Aayog
UNICEF
digital literacy
children online

More Telugu News