Chandrababu Naidu: విశాఖ ఆర్థిక ప్రగతికి మాస్టర్ ప్లాన్... వైజాగ్ ఎకానమీ రీజియన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu Focuses on Vizag Economic Region Master Plan Development
  • 2032 నాటికి 135 బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
  • రోడ్లు, పోర్టులతో పాటు 49 కీలక ప్రాజెక్టులపై సమావేశంలో చర్చ
  • సమావేశానికి మంత్రులు, 9 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (VER) సమగ్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2032 నాటికి ఈ ప్రాంతాన్ని 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ విశాఖలో వీఈఆర్ మాస్టర్ ప్లాన్‌పై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వీఈఆర్ పరిధిలోకి వచ్చే 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో వీఈఆర్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ వంటి కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించి మొత్తం 49 ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. వాణిజ్యం, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన, పర్యాటకం, ఐటీ, వ్యవసాయం, విద్య, వైద్యారోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్యుత్ వంటి ప్రతి రంగానికి వేర్వేరుగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని సూచించారు.

వీఈఆర్ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న, కొత్తగా చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణంపైనా ప్రత్యేకంగా చర్చించారు. మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం అవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కీలక సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పి. నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, డోలా బాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర... 9 జిల్లాల కలెక్టర్లు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Chandrababu Naidu
Visakhapatnam
Vizag Economic Region
VER Master Plan
Andhra Pradesh Economy
Infrastructure Development
Industrial Growth
AP Development Projects
Nara Lokesh
Acham Naidu

More Telugu News