Pawan Kalyan: వరల్డ్ కప్ గెలిచిన భారత అంధుల మహిళల జట్టుకు పవన్ కల్యాణ్ ఘనసత్కారం

Pawan Kalyan Felicitates World Cup Winning India Women Blind Cricket Team
  • ప్రపంచ కప్ గెలిచిన అంధుల జట్టుతో పవన్ భేటీ
  • ఒక్కో క్రీడాకారిణికి రూ.5 లక్షల చెక్ అందజేత
  • క్రికెటర్ల సౌకర్యాలపై సీఎంలకు లేఖ రాస్తానని హామీ
  • కెప్టెన్ దీపిక గ్రామ సమస్యపై అధికారులకు తక్షణ ఆదేశాలు
ప్రపంచ కప్ గెలిచి దేశ కీర్తిని చాటిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, శిక్షకులు, సహాయక సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారిణుల ప్రతిభను కొనియాడుతూ, వారిని ఘనంగా సత్కరించారు.

విశ్వవిజేతలుగా నిలిచిన క్రీడాకారిణులకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్, ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రతి క్రీడాకారిణికి పట్టుచీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి బహుమతులు అందించి గౌరవించారు. అంధ క్రికెటర్లు సాధించిన ఈ విజయం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారిణులు తెలిపిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని తెలిపారు.

ఈ జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపిక కెప్టెన్‌గా ఉండటం, మరో క్రీడాకారిణి పాంగి కరుణకుమారి కూడా జట్టులో ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన కెప్టెన్ దీపిక తన గ్రామమైన తంబలహట్టి తండాకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరగా, వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కరుణకుమారి విజ్ఞప్తులపై కూడా తక్షణమే స్పందించాలని సూచించారు.

Pawan Kalyan
India Women Blind Cricket Team
Blind Cricket
Women's World Cup
Cricket World Cup
AP Deputy CM
Chandrababu Naidu
Deepika
Pangi Karuna Kumari
Sports in Andhra Pradesh

More Telugu News