Bristol Museum: బ్రిటన్ మ్యూజియంలో భారీ దొంగతనం.. భారతీయ కళాఖండాలు మాయం!

Indian Artifacts Stolen From Bristol Museum in UK
  • బ్రిటన్‌లోని బ్రిస్టల్ మ్యూజియంలో భారీ చోరీ
  • గల్లంతైన వాటిలో బ్రిటిష్ కాలంనాటి భారతీయ కళాఖండాలు
  • మొత్తం 600కు పైగా విలువైన వస్తువుల అపహరణ
  • దర్యాప్తు చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు
బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరంలో ఉన్న ఒక మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. దుండగులు 600కు పైగా అత్యంత విలువైన వస్తువులను అపహరించారు. వాటిలో బ్రిటిష్ కాలంనాటి భారతీయ కళాఖండాలు కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ప్రజల సహాయం కోరుతున్నారు.

బ్రిస్టల్‌లోని బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ మ్యూజియంలో సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య ఈ చోరీ జరిగింది. గల్లంతైన వస్తువులలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారికి చెందిన నడుము పట్టీ బకిల్, దంతంతో చేసిన బుద్ధుడి విగ్రహం వంటి అమూల్యమైన భారతీయ వస్తువులు ఉన్నాయి. ఈ కళాఖండాలు బ్రిటిష్ చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ఎవాన్ అండ్ సోమర్‌సెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు అనుమానితులు ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. ఈ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ కానిస్టేబుల్ డాన్ బర్గన్ మాట్లాడుతూ, "సాంస్కృతికంగా ఎంతో విలువైన ఈ వస్తువుల చోరీ నగరానికి తీరని నష్టం. వీటిలో చాలా వరకు విరాళంగా వచ్చినవే. నిందితులను పట్టుకోవడానికి ప్రజలు సహకరించాలని కోరుతున్నాం" అని తెలిపారు.

ఘటన జరిగి రెండు నెలలు దాటిన తర్వాత పోలీసులు ఈ వివరాలను వెల్లడించడం, ప్రజల సహాయం కోరడం చర్చనీయాంశంగా మారింది. ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
Bristol Museum
Bristol Museum theft
British Empire and Commonwealth Museum
Indian artifacts stolen
East India Company
UK museum theft
Art theft
Museum security
Crime news
England

More Telugu News