Bihar HIV Cases: బీహార్‌లో హెచ్‌ఐవీ కలకలం.. ఒకే జిల్లాలో 7400 మందికి పాజిటివ్

7400 HIV Cases In Bihars Sitamarhi Trigger Alarm
  • బీహార్‌లోని సీతామఢీ జిల్లాను వణికిస్తున్న ఎయిడ్స్
  • బాధితుల్లో 400 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడి
  • తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సోకుతున్న వైరస్
  • అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమంటున్న వైద్యులు
ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో సరైన అవగాహన కొరవడుతూనే ఉంది. దీని ఫలితంగా ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. బీహార్‌లోని సీతామఢీ జిల్లాలో హెచ్‌ఐవీ మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఏకంగా 7,400 మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారిక నివేదిక వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, బాధితుల్లో 400 మంది చిన్నారులు కూడా ఉండటం.

జిల్లా ఆసుప‌త్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. వైరస్ బారిన పడిన చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచే ఈ వ్యాధి సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల్లో ఎవరికి హెచ్‌ఐవీ ఉన్నా, పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వారు వివరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ హసీన్ అక్తర్ మాట్లాడుతూ.. "జిల్లాలో ప్రతి నెలా సగటున 50 నుంచి 60 కొత్త హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం గుర్తించిన బాధితుల్లో 5 వేల మందికి పైగా వైద్య చికిత్స అందిస్తున్నాం" అని తెలిపారు. ఈ గణాంకాలు వ్యాధి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
Bihar HIV Cases
HIV Bihar
Sitamarhi HIV
AIDS Bihar
HIV positive children
Dr Haseen Akhtar
ART center
HIV awareness
Bihar health crisis
HIV transmission

More Telugu News