Donald Trump: అక్రమ వలసలపై ఉక్కుపాదం.. దేశ భద్రతే ముఖ్యమన్న ట్రంప్ ప్రభుత్వం

Donald Trump Government Defends Stance on Illegal Immigration
  • అక్రమ వలసలపై కఠిన వైఖరిని సమర్థించుకున్న ట్రంప్ ప్రభుత్వం
  • బైడెన్ హయాంలో వేలాది మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని ఆరోపణ
  • సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు భారీగా తగ్గాయన్న హోంల్యాండ్ సెక్యూరిటీ
  • అమాయకులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న డెమోక్రాట్లు
  • అమెరికన్ పౌరులను ఎవరినీ దేశం నుంచి పంపలేదని స్పష్టం చేసిన ప్రభుత్వం
అక్రమ వలసలను నియంత్రించేందుకు తాము తీసుకుంటున్న కఠిన చర్యలను ట్రంప్ ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. సరిహద్దుల్లో భద్రతా లోపాల వల్ల దేశానికి తీవ్ర ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని, చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన వలసల మధ్య స్పష్టమైన తేడా ఉందని తేల్చిచెప్పింది.

హౌస్ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ సమావేశంలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ మాట్లాడుతూ.. అక్రమ వలసలకు ముగింపు పలుకుతున్నామని, నేర చరిత్ర ఉన్నవారిని గుర్తించి, అరెస్టు చేసి, దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు గత దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయని, గత ఏడాదితో పోలిస్తే దాదాపు 80% తగ్గాయని తెలిపారు.

ఇదే సమావేశంలో నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జోసెఫ్ కెంట్ మాట్లాడుతూ.. బైడెన్ ప్రభుత్వ హయాంలోని ‘ఓపెన్ బార్డర్స్’ విధానం వల్ల దేశ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడిందన్నారు. గత నాలుగేళ్లలో సరైన వెట్టింగ్ లేకుండా సుమారు 18,000 మంది ఉగ్రవాదులు, ఉగ్రవాద సంబంధాలున్న అనుమానితులు దేశంలోకి ప్రవేశించారని ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ సమయంలో తీసుకొచ్చిన వారిలో సరైన తనిఖీలు చేయలేదని, ఇటీవలే వాషింగ్టన్‌లో దాడికి పాల్పడిన వ్యక్తి కూడా అలాంటి వారిలో ఒకడేనని ఆయన గుర్తుచేశారు. బైడెన్ హయాంలో దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది వరకు ఎలాంటి తనిఖీలు లేకుండా దేశంలోకి వచ్చారని నోయెమ్ ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, ప్రభుత్వ చర్యలను డెమోక్రటిక్ చట్టసభ్యులు తప్పుబట్టారు. ఎలాంటి నేరచరిత్ర లేని వారిని, అమెరికా పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రతినిధి లూ కొరియా ఆరోపించారు. దీనిపై స్పందించిన నోయెమ్.. తాము ఏ అమెరికా పౌరుడినీ దేశం నుంచి పంపలేదని స్పష్టం చేశారు. గుర్తింపు ధ్రువీకరణ కోసం తాత్కాలికంగా అదుపులోకి తీసుకుంటామని, తర్వాత విడిచిపెడతామని వివరించారు.

మరోవైపు, రిపబ్లికన్ సభ్యులు ప్రభుత్వ చర్యలకు మద్దతు తెలిపారు. గత 22 ఏళ్లలో ఇంతటి సురక్షితమైన సరిహద్దును తాను చూడలేదని ప్రతినిధి మైఖేల్ మెక్‌కాల్ అన్నారు.
Donald Trump
Illegal Immigration
US Border Security
Homeland Security
Kristi Noem
Joseph Kent
Terrorism Threat
Open Borders Policy
Immigration Control
US-Mexico Border

More Telugu News