Smriti Mandhana: భారత జెర్సీ ధరిస్తే అన్నీ మర్చిపోతా.. క్రికెట్టే నా ప్రాణం: స్మృతి మంధాన

Wearing India Jersey Makes Me Forget Everything says Smriti Mandhana
  • శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన
  • పెళ్లి రద్దయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు
  • క్రికెట్‌ను మించి ప్రేమించేది ఏదీ లేదన్న స్టార్ బ్యాటర్
  • వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ఆటపైనే పూర్తి దృష్టి అని వెల్ల‌డి
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితంలోని కష్టకాలం నుంచి బయటపడి, తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఆమె భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. కాగా, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో తన వివాహం రద్దయిన తర్వాత తొలిసారి ఆమె బుధవారం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంధాన మాట్లాడుతూ.. "నా జీవితంలో క్రికెట్‌ను మించి నేను దేనినీ ఎక్కువగా ప్రేమించను. భారత జట్టు జెర్సీ ధరించి దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇతర ఆలోచనలు ఏవీ మనసులోకి రావు. ఆ జెర్సీ ధరించడమే అతిపెద్ద ప్రేరణ. మనకున్న సమస్యలన్నీ పక్కనపెట్టి, దేశం కోసం గెలవాలనే బాధ్యత మాత్రమే గుర్తుంటుంది" అని ఆమె తన భావాలను పంచుకున్నారు.

జట్టులో విభేదాలపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, "జట్టులో జరిగే చర్చలు లేదా వాదనలను నేను సమస్యలుగా చూడను. దేశాన్ని గెలిపించాలనే తపన అందరిలోనూ ఉంటుంది. ఆ క్రమంలో భిన్నాభిప్రాయాలు రావడం సహజం. నిజానికి అలాంటి చర్చలు జరగకపోతే, మనం గెలవాలనేంత పట్టుదలతో లేనట్టే లెక్క" అని ఆమె వివరించారు.

నవంబర్ 23న పలాశ్ ముచ్చల్‌తో స్మృతి మంధాన వివాహం జరగాల్సి ఉండగా, ఆమె తండ్రి అనారోగ్యంతో వాయిదా పడింది. ఆ తర్వాత ఈ నెల‌ 7న తాము పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత మంధాన తిరిగి క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించింది.
Smriti Mandhana
India women cricket
Palash Muchhal
Harmanpreet Kaur
Sri Lanka T20 series
Indian cricket team
cricket news
sports news
team unity
marriage cancellation

More Telugu News