Viral Video: పాక్ అసెంబ్లీలో నవ్వుల ఘటన.. పది కరెన్సీ నోట్లకు 12 మంది ఓనర్లు!

Pakistan National Assembly Speaker waves lost cash 12 MPs raise hands
  • పాక్ జాతీయ అసెంబ్లీలో దొరికిన నోట్ల కట్ట
  • డబ్బు తనదంటే తనదని చేతులెత్తిన 12 మంది ఎంపీలు
  • పది నోట్లకు 12 మంది యజమానులా? అంటూ స్పీకర్ చమత్కారం
  • ఎంపీల తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్న పాకిస్థానీయులు
  • చివరకు అసలైన యజమానికి డబ్బు అప్పగింత
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. సభలో నేలపై పడి ఉన్న డబ్బుల కట్ట ఎవరిదని స్పీకర్ ప్రశ్నించగా, ఏకంగా 12 మందికి పైగా ఎంపీలు తమదేనంటూ చేతులెత్తడం నవ్వులు పూయించింది. ఈ ఘటనతో పాక్ చట్టసభ సభ్యులు సోషల్ మీడియాలో నవ్వులపాలయ్యారు.

సోమవారం జరిగిన సమావేశంలో స్పీకర్ అయాజ్ సాదిఖ్‌కు సభలో 5,000 పాకిస్థానీ రూపాయల నోట్లు పది దొరికాయి. వాటి విలువ భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 16,500. దీంతో ఆయన సభ్యుల నిజాయతీని పరీక్షించాలనుకున్నారు. "ఈ డబ్బు ఎవరిది? దయచేసి చేతులెత్తండి" అని స్పీకర్ ఆ నోట్ల కట్టను గాల్లో ఊపుతూ అడిగారు. వెంటనే దాదాపు 12-13 మంది ఎంపీలు తమదేనంటూ చేతులెత్తడంతో స్పీకర్ ఆశ్చర్యపోయారు.

ఈ అనూహ్య స్పందన చూసిన స్పీకర్, "నోట్లు పదే ఉన్నాయి. కానీ, యజమానులు 12 మంది ఉన్నారు" అని చమత్కరించారు. ఈ ఘటనతో సభా కార్యకలాపాలు కాసేపు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్థానీయులు తమ ప్రజాప్రతినిధులపై సెటైర్లు వేస్తున్నారు. వారి నిజాయతీ ఇదేనా? అంటూ కొందరు, వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మరికొందరు వ్యాఖ్యానించారు.

చివరకు ఆ డబ్బు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఎంపీ మహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదిదని తేలింది. ఆయన తర్వాత అసెంబ్లీ కార్యాలయం నుంచి ఆ డబ్బును తీసుకున్నారు. ఏదేమైనా ఈ ఘటన దేశ ఆర్థిక పరిస్థితికి, ప్రజాప్రతినిధుల నైతిక విలువలకు అద్దం పడుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Viral Video
Pakistan National Assembly
Ayaz Sadiq
Pakistani Rupees
Imran Khan
Mohammad Iqbal Afridi
Pakistan Economy
MP Honesty
Social Media Viral
Parliament Incident
Political Satire

More Telugu News