Revanth Reddy: స్టార్టప్‌లకు రూ.1000 కోట్లు... సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana CM announces Rs 1000 crore fund for startups
  • తెలంగాణ స్టార్టప్‌ల కోసం రూ.1000 కోట్ల నిధి ఏర్పాటు
  • హైదరాబాద్ టీ-హబ్‌లో 'గూగుల్ ఫర్ స్టార్టప్' హబ్ ప్రారంభం
  • రాష్ట్రంలో 100 యూనికార్న్ కంపెనీలు రావాలన్నదే లక్ష్యమ‌న్న‌ సీఎం రేవంత్
  • స్టార్టప్‌లకు అండగా తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంయుక్త ప్రణాళిక
  • ప్రొడక్ట్ ఆధారిత స్టార్టప్‌లపై దృష్టి పెట్టాలని సీఎం సూచన
తెలంగాణలోని స్టార్టప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని ప్రకటించింది. స్టార్టప్‌ల అభివృద్ధి కోసం రూ.1,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నిధిని సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తులో గూగుల్ వంటి పెద్ద సంస్థలుగా ఎదగాలని ఆయన స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు.

బుధవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ఏర్పాటు చేసిన 'గూగుల్ ఫర్ స్టార్టప్' హబ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో స్టార్టప్‌ల వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. "1998లో ఇద్దరు స్నేహితులు కాలిఫోర్నియాలోని ఓ గ్యారేజ్‌లో ప్రారంభించిన స్టార్టప్, ఈరోజు ప్రపంచ దిగ్గజం గూగుల్‌గా నిలిచింది. అదే స్ఫూర్తితో మన స్టార్టప్‌లు కూడా ఎదగాలి" అని ఆయన అన్నారు.

ప్రొడక్ట్ ఆధారిత, వినూత్నమైన స్టార్టప్‌లపై యువత దృష్టి సారించాలని సీఎం సూచించారు. గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు 20 ఏళ్ల క్రితం చిన్న స్టార్టప్‌లుగా మొదలై ఇప్పుడు బిలియన్ డాలర్ల కంపెనీలుగా మారాయని గుర్తుచేశారు. "హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్‌గా మిగిలిపోకూడదు. ఇక్కడి నుంచి కనీసం 100 స్టార్టప్‌లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నాం" అని రేవంత్ రెడ్డి తెలిపారు.

2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఈ హబ్ ఏర్పాటుతో రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణం మరింత బలపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంయుక్తంగా ఏఐ ఆధారిత స్టార్టప్‌లకు ప్రోత్సాహం, ప్రతిభను వెలికితీయడం, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేయడం వంటి అంశాలపై పనిచేయనున్నాయి.
Revanth Reddy
Telangana startups
startup fund
T-Hub Hyderabad
Google for Startups
Telangana economy
IT Minister Sridhar Babu
one trillion dollar economy
innovation ecosystem

More Telugu News