PM Modi: క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.1 లక్ష కోట్లు.. ప్రధాని మోదీ కీలక పోస్ట్.. మీ డబ్బు మీకేనంటూ పిలుపు

PM Modi on Unclaimed Deposits of Rs 1 Lakh Crore
  • బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో లక్ష కోట్లకు పైగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు
  • 'మీ డబ్బు మీ హక్కు' పేరుతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమం
  • రెండు నెలల్లోనే రూ. 2,000 కోట్లు తిరిగి చెల్లించినట్లు కేంద్రం వెల్లడి
  • ఉద్గమ్ పోర్టల్ ద్వారా మీ డబ్బును సులభంగా తెలుసుకునే అవకాశం
  • క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశమన్న ప్ర‌ధాని
దేశవ్యాప్తంగా బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్ల వంటి ఆర్థిక సంస్థల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బు భారీగా పేరుకుపోయింది. ఈ మొత్తం రూ.1 లక్ష కోట్లు దాటినట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో, సంబంధిత హక్కుదారులకు వారి డబ్బును తిరిగి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'మీ డబ్బు మీ హక్కు' (యువర్ మనీ, యువర్ రైట్) కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది.

బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎక్స్, లింక్డిన్ వేదికగా ప్రధాని మోదీ ఓ పోస్ట్ చేశారు. ప్రజలు మర్చిపోయిన లేదా క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశమని సూచించారు. దేశంలోని బ్యాంకుల్లో రూ. 78 వేల కోట్లు, బీమా కంపెనీల్లో రూ. 14 వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్లలో రూ. 3 వేల కోట్లు, డివిడెండ్ల రూపంలో మరో రూ. 9 వేల కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయని ఆయన తన పోస్టులో వివరించారు.

గతేడాది ప్రారంభమైన ఈ కార్యక్రమం అమలు తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ద్వారా అర్హులను గుర్తించి రూ. 2,000 కోట్లు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. ప్రజలకు వారి ప్రాంతీయ భాషల్లోనే అవగాహన కల్పిస్తున్నామని, సందేహాలను నివృత్తి చేస్తున్నామని చెప్పారు.

పాత బ్యాంకు ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో తమకు తెలియని డబ్బులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు ప్రజలకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్లలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆర్‌బీఐ తీసుకొచ్చిన 'ఉద్గమ్' (UDGAM) పోర్టల్ ద్వారా కూడా సులభంగా వివరాలు తెలుసుకోవచ్చు.
PM Modi
Unclaimed Deposits
Your Money Your Right
RBI UDGAM Portal
Unclaimed Funds India
Indian Banks
Insurance Companies India
Mutual Funds India
Pankaj Choudhary

More Telugu News