Shoban Babu: ఎన్టీఆర్ సిఫార్స్ తో శోభన్ బాబు కొట్టిన సూపర్ హిట్ ఇదే!

Sobhan Babu Special
  • కెరియర్ ఆరంభంలో ఇబ్బందులు పడిన శోభన్ బాబు
  • హీరోగా ఆయనను నిలబెట్టిన సినిమాలలో ఒకటిగా 'జీవనజ్యోతి'
  •  ఈ సినిమా కథను ముందుగా విన్న ఎన్టీఆర్ 
  • హీరో పాత్రకి శోభన్ బాబు కరెక్ట్ అంటూ సిఫారసు 
  • మ్యూజికల్ హిట్ గా నిలిచిన సినిమా

వెండితెరపై రొమాంటిక్ హీరోగా శోభన్ బాబు సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే హీరోగా నిలదొక్కుకోవడానికి ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. 1975లో ఆయనకి సక్సెస్ ను అందించిన సినిమాలలో 'జీవనజ్యోతి' ఒకటి. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. శోభన్ బాబు కెరియర్ ను పరిగెత్తించిన సినిమాలలో ఇది ఒకటి. కె. రామలక్ష్మి కథను అందించిన ఈ సినిమాను డీవీఎస్ రాజు నిర్మించారు. శోభన్ బాబుకి ఈ సినిమాలో ఛాన్స్ రావడానికి కారకులు ఎన్టీ రామారావు.

'జీవనజ్యోతి' కథతో కె విశ్వనాథ్, డీవీఎస్ రాజు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్లి కథను ఆయనకు వినిపించారు. కథ మొత్తం విన్న ఎన్టీఆర్, ఇది శోభన్ బాబు చేస్తే బాగుంటుంది అని అన్నారట. ఆయనే ఈ కథకి కరెక్టుగా ఉంటాడని తేల్చి చెప్పారట. తన కోసం మరో కథ ఏదైనా ఉంటే చెప్పమనీ, ఆల్రెడీ తాను కమిటైన సినిమాలు పూర్తయిన తరువాత చేస్తానని ఆయన స్పష్టం చేశారట. దాంతో కె విశ్వనాథ్, డీవీఎస్ రాజు ఇద్దరూ కూడా ఆ కథను శోభన్ బాబుకి వినిపించారు.      

కథ బాగుండటం వలన .. ఆ కథలోని హీరో పాత్రకి తాను సరిగ్గా సరిపోతానని ఎన్టీఆర్ చెప్పడం వలన శోభన్ బాబు పెద్దగా ఆలోచన చేయలేదట. అలా ఆయన ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. శోభన్ బాబు జోడీగా వాణిశ్రీ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. కేవీ మహదేవన్ స్వరపరిచిన పాటలు, ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గాను నిలబెట్టాయి. అందువల్లనే శోభన్ బాబు తన చివరి రోజులలోను ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేసేవారు. 

Shoban Babu
NTR
Jeevana Jyothi
K Viswanath
Vanisri
Telugu cinema
Tollywood
DVS Raju
KV Mahadevan
Telugu movie hits

More Telugu News