YS Jagan Mohan Reddy: ప్రజలను మోసం చేసేందుకే ఆ లెక్కలు: సీఎంపై జగన్ విమర్శ

YS Jagan Criticizes AP GSDP Figures as Deceptive
  • జీఎస్‌డీపీపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందన్న జగన్
  • కాగ్ నివేదికలోని వాస్తవాలను దాచిపెడుతున్నారని వ్యాఖ్య
  • రాష్ట్ర ఆదాయం తగ్గి, అప్పులు పెరిగాయన్న జగన్
  • ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిపై ప్రభుత్వం విడుదల చేసిన అంచనా లెక్కలు ప్రజలను మోసం చేసేందుకేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు.

ప్రభుత్వం విడుదల చేసే జీఎస్‌డీపీ అంచనా లెక్కలను వండివార్చవచ్చని, కానీ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆడిట్ చేసే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలను మార్చలేరని జగన్ అన్నారు. కాగ్ విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం లెక్కల ప్రకారం రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉందని, అప్పులు అపూర్వ స్థాయిలో పెరిగాయని, మూలధన వ్యయం దారుణంగా పడిపోయిందని జగన్ వివరించారు. ఆర్థిక వ్యవస్థలో వినియోగం, పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని, రెవెన్యూ, ద్రవ్య లోటు ఆందోళనకర స్థాయిలో వున్నాయని పేర్కొన్నారు. విచ్చలవిడి అవినీతి కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు.

ఈ వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మూడు సూటి ప్రశ్నలు సంధించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిజంగానే అభివృద్ధి చెందుతుంటే, ప్రభుత్వం ఎందుకింత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది?, 2014-19 మధ్య మీ హయాంలో జీఎస్‌డీపీ వృద్ధి బాగుంటే, జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటా 2019-24 మధ్య కాలంతో పోలిస్తే ఎందుకు తగ్గింది?, 2014-19 మధ్య మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తే, తలసరి ఆదాయంలో రాష్ట్ర ర్యాంకు కనీసం ఒక్క స్థానం కూడా ఎందుకు మెరుగుపడలేదు? అని జగన్ ప్రశ్నించారు.

ప్రజలందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు గానీ, ఎల్లకాలం మోసం చేయలేరన్న అబ్రహం లింకన్ మాటలను చంద్రబాబుకు గుర్తు చేస్తున్నానని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన ఐదేళ్ల పాలనతో పాటు, టీడీపీ ప్రభుత్వ పనితీరుపై వాస్తవాలను బయటపెట్టే స్లైడ్లను కూడా జత చేస్తున్నానని తెలిపారు. 
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
GSDP
Chandrababu Naidu
CAG
economic growth
state finances
debt
corruption
Telugu Desam Party

More Telugu News