Nimmala Ramanayudu: గోదావరి డెల్టాకు పూర్వవైభవం... ముంపు నివారణకు రూ.13.4 కోట్లతో లైడార్ సర్వే

Nimmala Ramanayudu Announces LIDAR Survey for Godavari Delta Flood Prevention
  • గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు
  • గత ప్రభుత్వం డెల్టా అభివృద్ధికి అడ్డుపడిందన్న మంత్రి నిమ్మల
  • ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల కోసం ఇప్పటికే రూ.150 కోట్ల మంజూరు
  • డిసెంబర్ నాటికి డీపీఆర్ సిద్ధం చేయాలన్న మంత్రి  
గోదావరి డెల్టాకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లో లైడార్ సర్వే నిర్వహించేందుకు రూ.13.4 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలో గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులపై ఆయన ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి గోదావరి జిల్లాల్లోని ముంపు సమస్యలు, లాకులు, గేట్ల మరమ్మతులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని సర్వే ఏజెన్సీని ఆదేశించినట్లు వెల్లడించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గోదావరి డెల్టాకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. నిధులు అందుబాటులో ఉన్నా ఆధునికీకరణ పనులు చేపట్టకపోగా, మధ్యలో ఉన్న పనులను కూడా నిలిపివేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి డెల్టా అభివృద్ధికి సైంధవుడిలా అడ్డుపడ్డారని, 150 ఏళ్లలో జరగనంత నష్టం చేశారని ఆయన మండిపడ్డారు. 
 
ఆధునికీకరణ పనులు నిలిచిపోవడం వల్ల ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య పెరిగిందని, డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో పంటలు నాశనమయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్ర ధాన్యాగారంగా ఉన్న డెల్టాలో రైతులు మొదటి పంట కూడా వేయలేని దుస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రూ.150 కోట్లు మంజూరు చేశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
 
ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహామూర్తి, గోదావరి డెల్టా సిస్టమ్ సీఈ, ఇతర ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Nimmala Ramanayudu
Godavari Delta
AP Water Resources
LIDAR Survey
Flood Prevention
Andhra Pradesh Irrigation
Dhavaleswaram Barrage
Modernization Works
East Godavari
West Godavari

More Telugu News