Revanth Reddy: రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

Telangana Thalli Statues Unveiled by Revanth Reddy Across 33 Districts
  • ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు
  • 33 జిల్లాల కోసం రూ. 5.80 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
  • గ్లోబల్ సమ్మిట్ వేదికగా విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ విగ్రహాలను రేవంత్ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ. 5.80 కోట్లు మంజూరు చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంప్రదాయ పల్లెటూరి మహిళా రైతు రూపంలో తీర్చిదిద్దారు. పసుపుపచ్చ అంచుతో కూడిన ఆకుపచ్చ చీర, నుదుటన ఎర్రని బొట్టు, కాళ్లకు కడియాలు, ముక్కుపుడక, మట్టి గాజులు, గుండు పూసల హారంతో అలంకరించారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులు పట్టుకుని చిరునవ్వుతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించారు. 

భూమి నుంచి మొత్తం 18 అడుగుల ఎత్తులో (12 అడుగుల విగ్రహం, 6 అడుగుల దిమ్మె) ఈ విగ్రహం ఉండనుంది. ఒక్కో విగ్రహం తయారీకి సుమారు రూ.17.50 లక్షలు ఖర్చు చేశారు. డిసెంబర్ 9వ తేదీని "తెలంగాణ తల్లి దినోత్సవం"గా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నేడు విగ్రహాలను ఆవిష్కరించారు.
Revanth Reddy
Telangana Thalli
Telangana
District Collectorates
Statue Inauguration
Global Summit Hyderabad
Telangana Formation Day
Telangana Culture
Village Woman Farmer

More Telugu News