Vijay: విజయ్ సభ వద్ద కలకలం.. తుపాకీతో వచ్చిన వ్యక్తిని అడ్డుకున్న పోలీసులు

Man carrying gun tries to enter actor Vijays rally in Puducherry detained
  • కరూర్ ఘటన తర్వాత పుదుచ్చేరిలో విజయ్ తొలి బహిరంగ సభ 
  • తుపాకీతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి
  • అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • టీవీకే నేత సెక్యురిటీ గార్డ్ ‌గా గుర్తించిన అధికారులు
  • కరూర్ ఘటన నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య సభ
పుదుచ్చేరిలో నటుడు విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) బహిరంగ సభ వద్ద కలకలం రేగింది. సభా ప్రాంగణంలోకి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతడిని పార్టీ శివగంగై జిల్లా కార్యదర్శి ప్రభుకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న డేవిడ్‌గా గుర్తించారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషాదం తర్వాత విజయ్ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడంతో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్స్‌పో గ్రౌండ్‌లో జరుగుతున్న‌ ఈ సభకు పార్టీ అభ్యర్థన మేరకు కేవలం 5,000 మందిని మాత్రమే అనుమతించినట్లు సీనియర్ ఎస్పీ ఆర్. కలైవానన్ తెలిపారు.

భద్రతా కారణాల దృష్ట్యా పొరుగున ఉన్న తమిళనాడు నుంచి ప్రజలు రావద్దని పోలీసులు ముందే సూచించారు. సభా ప్రాంగణంలోకి పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ప్రవేశం నిరాకరించారు. పార్టీ జారీ చేసిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు. తాగునీరు, అంబులెన్సులు, ప్రథమ చికిత్స బృందాలను సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. అంతకుముందు విజయ్ రోడ్ షోకు అనుమతి నిరాకరించిన పోలీసులు, కేవలం సభకు మాత్రమే కఠిన షరతులతో కూడిన అనుమతినిచ్చారు.
Vijay
Vijay Puducherry Meeting
Tamilaga Vettri Kazhagam
TVK
Puducherry Public Meeting
Gun Incident
Security Breach
Tamil Nadu Politics
R Kalainnan
Actor Vijay

More Telugu News