Shahid Afridi: కోహ్లీ, రోహిత్ శర్మ భవిష్యత్తుపై అఫ్రిది ఏమన్నాడంటే..!

Shahid Afridi Comments on Virat Kohli and Rohit Sharma Future
  • విరాట్, రోహిత్ భారత జట్టుకు వెన్నెముక వంటి వారని వ్యాఖ్య
  • 2027 ప్రపంచకప్ వరకు వాళ్లిద్దరూ ఆడగలరని అఫ్రిది ధీమా
  • టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు
  • తన సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టడంపై సంతోషం వ్యక్తం
భారత క్రికెట్ జట్టు సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిద్దరినీ జట్టు నుంచి తప్పించాలనే వాదనలను అఫ్రిది కొట్టిపారేశాడు. విరాట్, రోహిత్ భారత జట్టుకు వెన్నెముక వంటి వారని, 2027 ప్రపంచకప్ వరకు వాద్దరినీ కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.

"విరాట్, రోహిత్ భారత బ్యాటింగ్ లైనప్‌కు మూలస్తంభాలు అన్నది వాస్తవం. ఇటీవలి వన్డే సిరీస్‌లలో వారి ప్రదర్శన చూశాక, వారు 2027 ప్రపంచకప్ వరకు ఆడగలరని నమ్మకంగా చెప్పవచ్చు" అని అఫ్రిది పేర్కొన్నాడు. కీలక సిరీస్‌ల కోసం ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లను కాపాడుకోవాలని, బలహీన జట్లతో ఆడేటప్పుడు వారికి విశ్రాంతినిచ్చి కొత్త ఆటగాళ్లను పరీక్షించాలని సూచించాడు.

ఈ సందర్భంగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అఫ్రిది విమర్శలు గుప్పించాడు. "గంభీర్ తన కోచింగ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు, తాను చెప్పిందే సరైందని, తాను అనుకున్నదే జరగాలని భావించినట్లు అనిపించింది. కానీ, ఎప్పుడూ మనం చెప్పిందే సరైంది కాదని కొంతకాలానికే నిరూపితమైంది" అని వ్యాఖ్యానించాడు.

వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించడంపై అఫ్రిది సంతోషం వ్యక్తం చేశాడు. "రికార్డులు అనేవి బద్దలు కొట్టడానికే ఉంటాయి. నాకు ఎంతో ఇష్టమైన ఆటగాడు నా రికార్డును బ్రేక్ చేయడం ఆనందంగా ఉంది" అని అన్నారు. 2008 ఐపీఎల్ సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్‌తో కలిసి ఆడిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, "అతని బ్యాటింగ్ క్లాస్ చూసి అప్పుడే ఇంప్రెస్ అయ్యాను. రోహిత్ కచ్చితంగా భారత్‌కు ఆడతాడని నాకు అప్పుడే తెలుసు" అని అఫ్రిది వివరించాడు.
Shahid Afridi
Virat Kohli
Rohit Sharma
Indian Cricket Team
2027 World Cup
Gautam Gambhir
Cricket
Indian Batting
One Day Internationals
ODI Cricket

More Telugu News