Priyanka Gandhi: వందేమాతరంపై పార్లమెంట్‌లో చర్చ.. అందుకేనంటూ ప్రియాంక గాంధీ ఆరోపణ

Priyanka Gandhi Slams Vande Mataram Parliament Debate
  • వచ్చే ఏడాది బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నందునే చర్చ చేపట్టారన్న ప్రియాంక గాంధీ
  • ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే చర్చ అని విమర్శ
  • వందేమాతరంపై చర్చ పెట్టినట్లే నెహ్రూపై కూడా చర్చిద్దామని సూచన
పశ్చిమ బెంగాల్‌లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందునే పార్లమెంటులో వందేమాతరం గేయంపై చర్చ చేపట్టారని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా ఆ గేయంపై సభలో చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం వందేమాతరంపై చర్చ కోరుకుంటోంది. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ చర్చను చేపట్టారు" అని ఆరోపించారు.

వందేమాతరం భారత ప్రజల్లో మమేకమై ఉందని, ఇది మన జాతీయ గీతమని ఆమె అన్నారు. ప్రజలు వర్తమానం, భవిష్యత్తును వదిలి గతంలోకి తొంగి చూడాలని ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. ఈ దేశంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, వారిని ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా చర్చ జరపడం లేదని అన్నారు.

అధికార పార్టీ సభ్యులు ఎప్పుడూ నెహ్రూ గురించి మాట్లాడుతున్నారని, కాబట్టి ఒక పని చేద్దామని ప్రియాంక గాంధీ అన్నారు. అందుకోసం సమయం కేటాయించుకుందామని, నెహ్రూ గురించి మాట్లాడాలనుకున్న అంశాలన్నీ ఓ జాబితాగా తయారుచేద్దామని, వాటిపై చర్చిద్దామని సూచించారు. ఇక ఆ అధ్యాయాన్ని అక్కడితో ముగించుకుందామని వ్యాఖ్యానించారు. వందేమాతరం గురించి చర్చిస్తున్నట్లుగానే నెహ్రూ గురించి కూడా చర్చిద్దామని సూచించారు.
Priyanka Gandhi
Vande Mataram
West Bengal Elections
Parliament Discussion

More Telugu News